Smart Ration Cards : జిల్లాలకు చేరిన స్మార్ట్ రేషన్ కార్డులు - పంపిణీ ఎప్పుడంటే..?
రేషన్ పంపిణీ వ్యవస్థలో భారీ మార్పునకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. పాత పేపర్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుడి ఫోటోతో కూడిన క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను త్వరలోనే పంపిణీ చేయనుంది.
Telangana Smart Ration Card 2026 : రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అత్యంత ఆధునిక సాంకేతికతతో కూడిన 'స్మార్ట్ రేషన్ కార్డులు' అందజేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కొత్త స్మార్ట్ కార్డుల ముద్రణ ప్రక్రియ పూర్తయి వివిధ జిల్లాలకు కూడా చేరుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వీటిని పంపిణీ చేసేందుకు అధికారిక యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

ఏటీఏం సైజ్ లో….
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు ఏ4 (A4) సైజు కాగితపు పత్రాల రూపంలో ఉన్న రేషన్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. ఇవి త్వరగా చిరిగిపోవడం, తడిసి పాడైపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం…. మన చేతిలో ఉండే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు(ఏటీఏం) సైజులో అత్యంత నాణ్యమైన పీవీసీ (PVC) స్మార్ట్ కార్డులను తయారు చేయించింది. ఈ కొత్త కార్డుపై కుటుంబ యజమాని ఫోటోతో పాటు పేరు, చిరునామా వంటి వివరాలుంటాయి.
క్యూఆర్ కోడ్‌తో పారదర్శక సేవలు….
ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ (QR Code) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు డీలర్ ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? గతంలో ఏయే నెలల్లో బియ్యం, గోధుమలు, చక్కెర ఎంత పరిమాణంలో తీసుకున్నారు? అనే పూర్తి సమాచారం డిజిటల్‌గా కనిపిస్తుంది. కార్డుదారుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా కార్డు నంబర్ చెప్పి, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వేలిముద్ర వేసి అత్యంత సులభంగా రేషన్ సరుకులను పొందే వీలు కలుగుతుంది.
ఈ ఆధునిక స్మార్ట్ రేషన్ కార్డుల తయారీకి అయ్యే మొత్తం వ్యయాన్ని పౌరసరఫరాల శాఖ స్వయంగా భరిస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కొత్త కార్డుల కోసం లబ్ధిదారుల నుంచి ఎలాంటి రుసుము లేదా రుసుముల పేరిట అదనపు సొమ్ము వసూలు చేయరు. ఉచితంగానే ఈ కార్డులను పేదలకు అందజేస్తారు.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1,05,42,188 రేషన్ కార్డులు ఉండగా…. వీటి ద్వారా ఏకంగా 3,39,96,239 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ భారీ డిజిటల్ మార్పుతో రేషన్ పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో పాటు పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే పంపిణీ తేదీకి సంబంధిచిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరగా… గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అధికారికంగా తేదీలను ప్రకటిస్తారు. ఆ వెంటనే అన్ని నియోజకవర్గాల్లో వీటిని పంపిణీ చేస్తారు. తుది మార్గదర్శకాలు రాగానే ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్ల సమక్షంలో లబ్ధిదారుల చేతికి ఈ స్మార్ట్ కార్డులను అందిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

