...
...
Next Story

గ్లోబల్ సమ్మిట్‌కు కీరవాణి సంగీత దర్శకత్వంలో 4 భాషల్లో ప్రత్యేక గీతం.. 30 ఫుడ్ స్టాళ్లతో హైదరాబాదీ రుచులు!

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై కీరవాణి సంగీత దర్శకత్వంలో 4 భాషల్లో ప్రత్యేక గీతం రూపొందించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు తెలిపారు.

Published on: Nov 25, 2026, 21:28:51 IST
Advertisement

తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 తుది ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ వేడుకకు హాజరయ్యే దేశ, విదేశీ అతిథులకు అడుగడుగునా అద్భుతమైన ఆతిథ్యం అందించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో 4 భాషల్లో ప్రత్యేక గీతం రూపొందిస్తున్నట్టుగా చెప్పారు.

ఎంఎం. కీరవాణి(ఫైల్ ఫొటో)
ఎంఎం. కీరవాణి(ఫైల్ ఫొటో)

హైదరాబాద్ సచివాలయంలో ప్రోటోకాల్, ఫుడ్, కల్చరల్ కమిటీల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వేదికగా జరగనున్న ఈ సదస్సు విశేషాలను సీఎస్ వెల్లడించారు.

ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తరలివస్తున్న నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను డిజైన్ చేశారు. సమ్మిట్‌లో కేవలం వ్యాపార చర్చలు మాత్రమే కాకుండా, అతిథులను మంత్రముగ్ధులను చేసేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించినట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు:

డిసెంబర్ 7 సమ్మిట్ ప్రారంభం రోజున తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అతిథులకు ఘన స్వాగతం పలుకుతారు. డిసెంబర్ 9 ముగింపు రోజున పర్యావరణ పరిరక్షణ సందేశంతో కూడిన భారీ 'క్లైమేట్ కాన్సర్ట్', అట్టహాసమైన సాంస్కృతిక వేడుకలను నిర్వహించనున్నారు.

అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర తారలు, వివిధ రంగాల ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయని అధికారులు ధృవీకరించారు.

వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయం నుంచి వేదిక వరకు రవాణా, వసతి, భద్రత విషయాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎస్ స్పష్టం చేశారు. మెుత్తం 45 స్టాళ్లు ఏర్పాటు చేస్తుండగా.. ముఖ్యంగా 30 ఫుడ్ స్టాళ్లలో హైదరాబాద్ బిర్యానీ సహా తెలంగాణ సంప్రదాయ వంటకాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాలని ఫుడ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks