Hyderabad Airport : హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో స్టోరేజ్ సామర్థ్యం 140 శాతం వృద్ధి

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్‌లో స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకుంది. ఆధునీకరించిన ఎలివేటెడ్ ట్రాన్స్‌ఫర్ వెహికల్ (ETV) ఆధారిత స్టోరేజ్ వ్యవస్థను ప్రారంభించింది.

Published on: Nov 25, 2026, 14:47:20 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) కార్గో (సరకు రవాణా) సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది. శంషాబాద్ విమానాశ్రయ కార్గో టెర్మినల్‌లో ఆధునీకరించిన ఎలివేటెడ్ ట్రాన్స్‌ఫర్ వెహికల్(ETV) ఆధారిత స్టోరేజ్ వ్యవస్థను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(GHIAL) తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్

ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటుతో ఎయిర్‌పోర్ట్ సరకు నిల్వ, రవాణా సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడమే కాకుండా, అత్యంత సున్నితమైన ఫార్మా ఉత్పత్తుల రవాణాకు సరికొత్త వేగం లభించనుంది. ప్రస్తుత కార్గో టెర్మినల్ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం లేకుండానే, కేవలం వర్టికల్ స్టోరేజ్ సాంకేతికతను జోడించడం ద్వారా ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ అద్భుతమైన ఫలితాన్ని సాధించారు. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువ సరకును సురక్షితంగా భద్రపరచవచ్చు.

కొత్త వ్యవస్థ టెర్మినల్ యూనిట్ లోడ్ డివైస్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 33 నుండి 80కి పెంచింది. ఇది 140 శాతం పైగా పెరుగుదల. వర్టికల్ స్టోరేజ్ స్థలాన్ని జోడించడం ద్వారా విమానాశ్రయం ప్రస్తుత టెర్మినల్ ప్రాంతాన్ని విస్తరించకుండానే పెద్ద మొత్తంలో కార్గోను నిర్వహించగలదు.

అదనంగా అందుబాటులోకి వచ్చిన ఈ సామర్థ్యం వల్ల ఒకే సమయంలో పలు భారీ సరకు రవాణా విమానాల కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించే వీలు కలిగింది. భవిష్యత్తులో పెరగనున్న రవాణా అవసరాలను తట్టుకునేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది. వ్యాక్సిన్లు, ప్రాణరక్షక ఔషధాలు, త్వరగా పాడయ్యే ఆహార పదార్థాల వంటి ఉష్ణోగ్రత నియంత్రిత (Temperature-controlled), ప్రత్యేక సరుకుల నిర్వహణకు ఈ అప్‌గ్రేడ్ వెన్నెముకలా నిలవనుంది.

ఈ నూతన వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా జీహెచ్ఐఏఎల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) కదిర్ కదిరవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ సాంకేతిక ఆధునీకరణ వల్ల విమానయాన సంస్థలు, ఫ్రైట్ ఫార్వార్డర్లు, లాజిస్టిక్స్ భాగస్వాములు తమ సరుకును మరింత వేగంగా, నమ్మకంగా, సులభంగా రవాణా చేయగలుగుతారు. పెరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మేం మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నాం. ఇది కేవలం భవిష్యత్తు వృద్ధికి పునాది మాత్రమే కాదు.. అధిక విలువ కలిగిన, సమయపాలన అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్ కార్గోకు హైదరాబాద్ ఒక నమ్మకమైన గ్లోబల్ హబ్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు దోహదపడుతుంది.' అని కదిరవన్ అన్నారు.

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ గేట్‌వేలలో ఒకటిగా శంషాబాద్ విమానాశ్రయం ఎదుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మా సిటీల నుండి నిత్యం టన్నుల కొద్దీ ఔషధాలు అమెరికా, యూరప్ సహా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

ఈటీవీ సిస్టమ్ ఆటోమేటెడ్ పద్ధతిలో పనిచేయడం వల్ల సరకు లోడింగ్, అన్‌లోడింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది. మానవ ప్రమేయం తగ్గి యంత్రాల ద్వారా కంటైనర్ల తరలింపు జరగడం వల్ల విలువైన సరకు దెబ్బతినే అవకాశాలు ఉండవు. ఇ-కామర్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు తక్కువ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.