...
...
Next Story

Principal Roopa Reddy Murder Case : ‘బాబు’ అనే ఒక్క మాటతో దొరికిన క్లూ... ప్రిన్సిపాల్ రూపారెడ్డ మర్డర్ ఎలా జరిగిందంటే

School Principal Roopa Reddy Murder Case : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగిన స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Published on: Aug 19, 2026, 19:39:23 IST
Advertisement

School Principal Roopa Reddy Murder Case : నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. డబ్బుపై ఆశతో పాటు ప్రిన్సిపాల్‌పై పెంచుకున్న కక్షే ఈ ఘాతుకానికి కారణమని విచారణలో తేలింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు పదో తరగతి మైనర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైంటిఫిక్ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు మరియు సాంకేతిక విశ్లేషణ ఈ కేసును కొలిక్కి తేవడంలో కీలక పాత్ర పోషించాయి.

బాబు అనే మాటతో……

ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు - విద్యార్థులు అరెస్ట్
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు - విద్యార్థులు అరెస్ట్

హత్యకు గురయ్యే ముందు ప్రిన్సిపాల్ రూపారెడ్డి మాట్లాడిన చివరి ఒకే ఒక్క పదం ఈ కేసు దర్యాప్తులో అతిపెద్ద మలుపుగా మారింది. ఫోన్ సంభాషణ ముగిసే సమయంలో ఆమె నోటి నుంచి వచ్చిన “బాబు” అనే మాటను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారనే కోణంలో విచారణ చేపట్టగా…. అనుమానం నేరుగా పాఠశాల విద్యార్థుల వైపు మళ్లింది. దీంతో దర్యాప్తు అధికారులు స్కూల్ విద్యార్థుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఈ కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలు అహోరాత్రులు శ్రమించాయి. పోలీసులు దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలోని 70కి పైగా సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను నిశితంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన 80 మందికి పైగా వ్యక్తులను సుదీర్ఘంగా విచారించారు. చివరకు సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారం సాయంతో నిందితులైన ఆ ఇద్దరు పదో తరగతి విద్యార్థులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి రూ. 1.54 లక్షల నగదుతో పాటు రూపారెడ్డి ఐఫోన్, హత్యకు ఉపయోగించిన ఆయుధం, హ్యాండ్ గ్లౌజులు, మాస్కులు మరియు రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే..?

“రూపారెడ్డి చివరిసారిగా ఆమె పిన్నితో మాట్లాడుతూ ”బాబు" అనే పదం వాడారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టాం. ఎవరితో ఆమె అలా మాట్లాడారనే విషయంపై ముందుకెళ్లాం. స్కూల్‌లో పిల్లలను కూడా అలా అంటారేమోనని అక్కడ విచారించాం. ప్రిన్సిపల్‌ హత్య తర్వాత నాలుగురోజులు ఆ స్కూల్‌కు సెలవులు ఇచ్చారు. రీఓపెన్‌ తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల గురించి ఆరా తీశాం. వారిలో ఐదుగురు పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. అందులో ఇద్దరు రెండు మూడు రోజుల నుంచి డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించాం. నగదు ఎక్కడిదని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ నోట్లపై రక్తపు మరకలు ఉన్నాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తే మనిషి రక్తంగా తేలింది" అని జిల్లా ఎస్పీ వివరించారు.

"అరెస్ట్ అయిన ఇద్దరు నిందితుల్లో ఒక విద్యార్థి గతంలో అదే స్కూల్ హాస్టల్‌లో ఉంటూ చదువుకునేవాడు. కొద్దిరోజుల క్రితం అతడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో కొంత డబ్బుతో పాటు ఒక సెల్‌ఫోన్ దొరికింది. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి, ఇతర టీచర్లు అతడిని తీవ్రంగా మందలించారు. అంతేకాకుండా తల్లిదండ్రులను స్కూలుకు పిలిపించి…… వారి ముందే హెచ్చరించి హాస్టల్ నుంచి తొలగించి డేస్కాలర్‌గా మార్చారు. అందరి ముందూ తమను మందలించారనే అవమానంతో సదరు విద్యార్థి ప్రిన్సిపాల్ రూపారెడ్డిపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు.

మరోవైపు ఈ మైనర్ నిందితుడికి మద్యం తాగే అలవాటుతో పాటు బైక్‌లపై తిరగడం అంటే తీవ్రమైన మోజు ఉండేది. ఇటీవల ఒకసారి గోవా టూర్‌కు కూడా వెళ్లొచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి జాలీగా గడపాలనే ఆలోచనతో, ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని పథకం వేశాడు. ఇందుకోసం మరొక మైనర్ స్నేహితుడిని కూడా తనతో పాటు కలుపుకున్నాడు" అని ఎస్పీ తెలిపారు.

పథకం ప్రకారం ఈ నెల 11వ తేదీన ప్రిన్సిపాల్ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, నిందితులు ఇద్దరూ కలిసి ఆమె ఇంటికి చేరుకున్నారు. అందులో ఒక విద్యార్థి ముఖానికి మాస్క్ ధరించి కాంపౌండ్ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అయితే అనుకోకుండా అతడి ముఖానికి ఉన్న మాస్క్ ఊడిపోవడంతో…. ప్రిన్సిపాల్ రూపారెడ్డి అతడిని వెంటనే గుర్తుపట్టారు. తాను దొరికిపోయాననే భయంతో సదరు విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశాడు" అని జిల్లా ఎస్పీ వివరించారు.

కేసును చాకచక్యంగా ఛేదించిన ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాల పనితీరును నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి పురస్కారాలు అందజేస్తామని ఆయన ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe