మిస్టరీగా స్కూల్ ప్రిన్సిపాల్ మర్డర్.. ఇంటికి వచ్చిన ఆ స్నేహితులు ఎవరు?
నల్గొండలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసు మిస్టరీగా ఉంది. పాఠశాల నుంచి వచ్చిన ఆమెను ఎవరు చంపారు అనేది తేలాల్సి ఉంది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపా రెడ్డి (48) దారుణంగా హత్యకు గురయ్యారు. బుధవారం రోజున ఆమె నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యంత క్రూరంగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దేవరకొండ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP) ఎమ్.వి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. దాడి తీవ్రత అత్యంత ఘోరంగా ఉంది. రూపా రెడ్డి శరీరంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇంట్లోని నగదు గానీ, ఇతర విలువైన వస్తువులు గానీ మాయం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో దొంగతనం కోసం జరిగిన హత్య కాదని, కేవలం కక్షలు లేదా తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అసలేం జరిగింది?
రూపా రెడ్డి తన భర్త రాజేందర్ రెడ్డితో కలిసి శనివారం నాడు హైదరాబాద్‌కు వెళ్లారు. వారి కుమారుడు అభినవ్ రెడ్డి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. భర్తకు అక్కడ పని ఉండటంతో రూపా రెడ్డి మంగళవారం ఉదయం ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగి వచ్చి బడికి హాజరయ్యారు.
సాయంత్రం 5:30 గంటల వరకు పాఠశాలలోనే ఉన్న ఆమె కొందరు స్నేహితులు ఇంటికి వస్తున్నారు అని సహోద్యోగులకు చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం ఆమె పాఠశాలకు రాకపోవడం, భర్త రాజేందర్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం మొదలైంది.
భర్త చెప్పిన మేరకు వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు వెళ్లి చూడగా లోపల తలుపులు వేసి ఉన్నాయి. దీంతో రాజేందర్ రెడ్డి పక్క ఇంట్లోనే నివాసముంటున్న చింతపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్ రామ్మూర్తిని అద్దెవారు సంప్రదించారు. ఎస్ఐ పొరుగువారితో కలిసి ఇంటి వెనకాల వైపునకు వెళ్లి చూశారు. వెనకాల డోర్ తీసి ఉంది. రూపా రెడ్డి రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. బాధితురాలి భర్త, కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి బాగా తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ తగాదాలు, వ్యక్తిగత విభేదాలతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


