స్పీకర్కు ఇదే చివరి అవకాశం..! ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం… కీలక ఆదేశాలిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది.

స్పీకర్కు చివరి అవకాశం ఇస్తున్నామని… రెండు వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని గుర్తు చేసింది. నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని… మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారని వివరించారు. ఆ తర్వాత స్పీకర్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారని.. అలాగే సెక్రటరీ జనరల్ మారారని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాప్యం జరుగుతోందని వాదించారు. మిగిలిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.
పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది డీఎస్ నాయుడు వాదనలు వినిపిస్తూ…. గతంలోనే నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన గడువు పూర్తి అయిపోయిందన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు… ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారని వివరించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
సింఘ్వీ వాదనలు వినిపిస్తూ… కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మిగతా వారి విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. స్పీకర్ వైఖరి విషయంలో అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపింది. స్పీకర్‌కు చివరి అవకాశం ఇస్తున్నామని.. రెండు వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 4 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ తరపు న్యాయవాది సింఘ్వీ కోరగా… కోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని సూచించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

