విశ్లేషణ : డిజిటల్ విద్యా విప్లవంలో 'టీ-సాట్' తెలంగాణ యువతకు వరం

టీ-సాట్ కేవలం ఒక డిజటల్ విద్యా సాధనం మాత్రమే కాదు, తెలంగాణ విద్యారంగంలో మార్పుకు మార్గదర్శిగా నిలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులకు అండగా నిలుస్తోంది. 

Published on: Dec 26, 2025, 11:02:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంగరంగా వైభవంగా, పాఠకులతో కళకళలాడుతోంది. సుమారు నాలుగు వందల స్టాల్స్‌తో ఎన్‌డీఆర్ స్టేడియంలో తీర్చిదిద్దిన సుందర ప్రాంగణంలో పుస్తక సముద్రం అలలాడుతోంది.వీటిలో ఆరో నెంబర్ స్టాల్‌లో ఉన్న సాఫ్ట్ నెట్ టీ-సాట్ (తెలంగాణ స్కిల్స్, అకడమిక్స్ అండ్ ట్రైనింగ్) అందరినీ ఆకట్టుకుంటోంది.

డిజిటల్ విద్యా విప్లవంలో 'టీ-సాట్'
డిజిటల్ విద్యా విప్లవంలో 'టీ-సాట్'

‘‘ప్రతి ఇల్లు గ్రంథాలయం కావాలి. ప్రతి మెదడుకు జ్ఞానం చేరాలంటే... పుస్తకాలతోనే సాధ్యమవుతుంది’’ అని వల్లనే అని పెద్దలు అంటుంటారు. కానీ, ఇప్పుడు మారుతున్న కాలానికి తగినట్టుగా పుస్తకం కూడా రూపం మార్చుకుంది. ఆ డిజిటల్ పుస్తకాన్ని తెలంగాణలో ఇంటింటికి చేర్చేందుకు టీ-సాట్ కృషి చేస్తోంది. టీ-సాట్ తీసుకొచ్చిన ఈ డిజిటల్ విద్యా విప్లవం తెలంగాణ యువతకు, విద్యార్థులకు భవితకు బాటలు వేస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత... టీ-సాట్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసి విద్యా వ్యవస్థలో సమాన అవకాశాలను సృష్టిస్తోంది.

టీ-సాట్ అంటే ఏంటి…?

తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్‌గా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో నడుస్తున్న ఈ నెట్‌వర్క్, సాఫ్ట్‌నెట్ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్) ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఇది జీసాట్-16 శాటిలైట్ ద్వారా ప్రసారాలు అందిస్తూ, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తోంది.

టీ-సాట్ నిపుణ (స్కిల్స్, పోటీ పరీక్షలు), టీ-సాట్ విద్య (స్కూల్ ఎడ్యుకేషన్) అనే రెండు ప్రధాన చానెళ్లతో పనిచేస్తుంది. ఇవి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా సెల్ఫ్ ప్రిపరేషన్ కి అండగా నిలుస్తోంది. టీ-సాట్ యాప్, యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా కంటెంట్ అందుబాటులో ఉంది. తెలంగాణలోని ఉన్నత విద్యా మండలితో ఎమ్‌ఓయూ కుదుర్చుకుని, అన్ని రకాల ప్రసారాలు అందిస్తుండటం విద్యార్థులకు, నిరుద్యోగులకు వరంగా మారింది.

టీ-సాట్ విజయాలు అసాధారణమైనవి. ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ ఎడ్యుకేషనల్ నెట్‌వర్క్‌గా నిలిచింది. విద్యా ప్రసార చానెళ్లలో 48 లక్షల యూజర్స్‌తో డిజిటల్ ప్రసారాల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. యూట్యూబ్‌లో 8.4 లక్షల సబ్‌స్క్రైబర్స్, సుమారు 14 కోట్ల వ్యూస్ ఉన్నాయి. డిజిటల్ శాటిలైట్ ద్వారా 48 లక్షలమంది యూజర్స్‌తో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. జీసాట్-16 శాటిలైట్ ద్వారా తెలంగాణలోని సుమారు 80 లక్షల కుటుంబాలకు ప్రసారాలు అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన కేబుల్ నెట్‌వర్క్‌ల అందుబాటులో కూడా ఉంది.

తెలంగాణ విద్యా రంగంలో టీ-సాట్ పాత్ర ప్రత్యేకమైనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలు, సూచనల మార్గదర్శకత్వంలో, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో, సీఈఓ బోదనపల్లి వేనుగోపాల్ రెడ్డి టీ-సాట్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డిజిటల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి పట్టణ విద్యార్థులతో పోటీపడాలని మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన పిలుపును సాకారం చేసేందుకు టీ-సాట్ సిబ్బంది కృషి చేస్తోంది.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ద్వారా ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రత్యేక పాఠ్యాంశాలను బోధిస్తోంది. టీ-సాట్, ఫోటానిక్స్ వ్యాలీ కార్పొరేషన్ సంయుక్తంగా వీఎల్ఎస్ఐ పై వృత్తి నైపుణ్య శిక్షణ కూడా అందిస్తోంది. ప్రజలకు అవసరమైన విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వృత్తి నైపుణ్యం, భాషా నైపుణ్యాలపై ప్రత్యేక కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. సమాజానికి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తులను పరిచయం చేసేందుకు ‘స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహిస్తూ... ఎంతోమందికి ప్రేరణా పాఠాలు నేర్పుతోంది.

ప్రత్యేకంగా ఐదు యూట్యూబ్ చానెళ్లతో, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వీక్షకుల కోసం రీల్స్ రూపంలోనూ కంటెంట్ అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయి క్విజ్, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, మాక్ టెస్టులను కూడా నిర్వహిస్తోంది.

పోటీ పరీక్షలలో టీ-సాట్ పాత్ర అత్యంత కీలకమైనది. టెట్, డీఎస్సీ అభ్యర్థుల విజయంలో టీ-సాట్ కంటెంట్ కీలక పాత్ర పోషించింది. టీ-సాట్ సేవల ద్వారా వారు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అభివృద్ధిలో భాగస్వామ్యులుగా మారారు. పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే వారికోసం ప్రధాన సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ పై ‘జీఎస్ ఫర్ ఆల్’ పేరిట ప్రత్యేక లెసన్స్ ప్రసారం చేస్తోంది.

ప్రజా ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసిన గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌లకు విలువైన నాణ్యమైన కంటెంట్ అందిస్తోంది. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉద్యోగాల సాధనలో తోడ్పాటు అందించడానికి టీ-సాట్ నెట్‌వర్క్ డొమైన్‌లో 40 వేలకు పైగా వీడియోలు అందుబాటులో ఉంచింది. తెలంగాణలో ఉన్న విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవడానికి, నిరుద్యోగులు తమ ఉద్యోగ సోపానాన్ని నిర్మించుకోవడానికి టీ-సాట్‌ను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది తెలంగాణ స్కిల్ హబ్, టాస్క్ వంటి ఇతర స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్‌లతో సమన్వయం చేసుకుంటూ ఉపాధి అవకాశాలను పెంచుతోంది.

టీ-సాట్ ప్రభావం ఇప్పటికే అనేక కోణాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ విద్యార్థులు పట్టణ విద్యార్థులతో సమానంగా పోటీపడేలా చేసింది. విద్యా వ్యవస్థలో డిజిటల్ డివైడ్‌ను తగ్గించి, సమయం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రిపరేషన్ ని సుసాధ్యం చేసింది. ఆరోగ్యం, వ్యవసాయం, మహిళలు-పిల్లల సంక్షేమం, సాంస్కృతిక-క్రీడా కార్యక్రమాలు వంటివి కూడా చేర్చడం ద్వారా రాష్ట్ర ప్రజల సమగ్ర అభివృద్ధికి కూడా దోహదం చేస్తోంది.

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో టీ-సాట్‌ను చేర్చాలని ఇటీవలే అధికారులు సూచించారు అంటే, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితంలో అది పోషిస్తున్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. మొత్తంగా, టీ-సాట్ తెలంగాణ ప్రజలను జ్ఞానవంతులను చేసే మిషన్‌లో విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించి, అందరూ ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటూ ఉండటాన్ని హర్షించాలి. టీ-సాట్ కేవలం ఒక డిజటల్ విద్యా సాధనం మాత్రమే కాదు, తెలంగాణ విద్యారంగంలో మార్పుకు మార్గదర్శి…!!

- (విశ్లేషణ: వి. సంధ్య)

వి. సంధ్య , రచయిత
వి. సంధ్య , రచయిత

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More