...
...
Next Story

ఏసీబీ వలకు చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ - కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు! కళ్లు చెదిరేలా ఆస్తులు

సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి. సోమయ్యపై తెలంగాణ ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆయన ఇల్లు, బంధువుల నివాసాల్లో జరిపిన సోదాల్లో రూ.3.54 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.

Published on: Sep 3, 2026, 20:59:13 IST
Advertisement

అవినీతి అధికారులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ మార్గాల్లో కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు గురువారం అధికారికంగా వెల్లడించారు. నిందితుడికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సహచరుల ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసిన అధికారులు భారీగా అక్రమాస్తులను వెలికితీశారు.

ఏసీబీ అధికారుల సోదాలు
ఏసీబీ అధికారుల సోదాలు

సూర్యాపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి. సోమయ్య తన ఉద్యోగ పదవిని అడ్డుపెట్టుకుని, అవినీతి అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు ఆర్జించారనే విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం, 1988 (2018 సవరణ చట్టం) ప్రకారం సోమయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే అధికారులు సోమయ్య ఇల్లు, ఆఫీసుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు.

భారీగా ఆస్తులు….

ఈ తనిఖీల్లో అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. సోమయ్య పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. అందులో 3 ఎకరాల వ్యవసాయ భూమి, 5 నివాస గృహాలు, మరియు 8 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తుల ప్రభుత్వ విలువ రూ.3.54 కోట్లుగా ప్రాథమికంగా లెక్కించినప్పటికీ…. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు నిందితుడైన అధికారి బ్యాంకుల్లో రూ.49 లక్షల మేర గోల్డ్ లోన్ తీసుకున్నట్లు ఏసీబీ తనిఖీల్లో తేలింది. వీటికి తోడు సోమయ్యకు సంబంధించి ఇంకా ఇతర ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks