Telangana Retail Inflation : తెలంగాణలో అక్టోబర్‌లో 7 శాతానికి పైగా రిటైల్ ద్రవ్యోల్బణం
Telangana Retail Inflation : తెలంగాణలో అక్టోబర్ నెల చూసుకుంటే.. రికార్డు స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. ఒక్క నెలలోనే ఎక్కువగా ఎగబాకింది.
తెలంగాణ రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరల పెరుగుదల గట్టి షాక్ ఇస్తోంది. 2026 అక్టోబర్ నెలలో రాష్ట్రంలో రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) భారీగా పెరిగి 7.26 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ నెలలో 6.64 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, ఒక్క నెలలోనే గణనీయంగా ఎగబాకింది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. వరుసగా 10వ నెలలోనూ జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

2026 క్యాలెండర్ సంవత్సరంలో తెలంగాణ ద్రవ్యోల్బణం 7 శాతం మార్కును దాటడం ఇదే మొదటిసారి. జాతీయ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.54 శాతం ఉండగా, అక్టోబర్‌లో 6.09 శాతానికి చేరింది. కానీ తెలంగాణలో మాత్రం ఇది జాతీయ సగటు కంటే 1.17 శాతం అధికంగా ఉంది.
2026లో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం సాగిన తీరు (నెలవారీ వివరాలు) చూసుకుంటే.. జనవరి-4.92 శాతం, ఫిబ్రవరి-5.02 శాతం, మార్చి-5.83శాతం, ఏప్రిల్-5.81 శాతం, మే-6.15 శాతం, జూన్-6.36శాతం, జూలై-6.32 శాతం, ఆగస్టు-6.27శాతం, సెప్టెంబర్-6.64శాతం, అక్టోబర్-7.26శాతంగా నమోదైంది.
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల సెగ మరింత ఎక్కువగా ఉంది. అక్టోబర్ నెలలో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.68 శాతంగా నమోదు కాగా, గ్రామీణ తెలంగాణలో ఇది ఏకంగా 8.05 శాతానికి చేరుకుంది. జాతీయ స్థాయిలో గ్రామీణ ద్రవ్యోల్బణం 6.63 శాతంగా మాత్రమే ఉండగా, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అంతకంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో మొత్తం ఆరు రాష్ట్రాలు 7 శాతానికి పైగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. ఇందులో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు-7.29 శాతం, తెలంగాణ-7.26 శాతం, ఆంధ్రప్రదేశ్-7.25 శాతం, మధ్యప్రదేశ్-7.19 శాతం, ఒడిశా-7.17 శాతం, కర్ణాటక-7.07శాతంతో ఉన్నాయి.
ఇటీవలి కాలంలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడమే ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వ్యవసాయ దిగుబడులు తగ్గడం వల్ల కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం వ్యవసాయ ఉత్పత్తులపై పడటం వల్ల సరఫరా తగ్గి, ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ద్రవ్యోల్బణం 7 శాతాన్ని దాటడంతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (గరిష్టంగా 6 శాతం లోపు) పరిమితిలో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


