కన్నీరు పెట్టుకున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది.

Published on: Sep 7, 2026, 17:09:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా తీవ్ర రాజకీయం రాజుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (తాతా మధు) అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, అధికార పక్ష సభ్యులు కలిసి సంఘీభావం తెలిపారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి

ఎమ్మెల్సీ తాతా మధు మాటలను ఖండిస్తూ.. మంత్రి సీతక్క మాట్లాడారు. స్పీకర్ తల్లిని అవమానించడం బాధకరమని అన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సభ గౌరవాన్ని మంటగలిపేలా ప్రవర్తించినందుకు ఆయనను మండలి నుంచి బహిష్కరించే (డిస్మిస్ చేసే) దిశగా యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ ఉదంతంపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. స్పీకర్‌కు జరిగిన అవమానాన్ని తెలంగాణ ప్రజలకు, సభ్య సమాజానికి జరిగిన అవమానంగా ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న తన పార్టీ సభ్యులను పిలిపించి, పథకం ప్రకారమే స్పీకర్‌పైకి ఉసిగొల్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఒక దళిత వర్గానికి చెందిన నేత స్పీకర్ స్థానంలో ఉండటం ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు జుగుప్సాకరమైన భాషను ఉపయోగించారని, కేసీఆర్ మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తాననడం, మూడెకరాల భూమి ఇస్తామనడం అంతా మోసమేనని మండిపడ్డారు. స్పీకర్ పట్ల అపచారంగా ప్రవర్తించిన తాతా మధును పదవి నుంచి డిస్మిస్ చేయడంతో పాటు, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ ఘటనపై తెలంగాణ ప్రజలకు, స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా బీఆర్ఎస్ వైఖరిపై విరుచుకుపడ్డారు. చట్టసభలు, స్పీకర్ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడూ నిబంధనలు పాటించలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై జరిగిన దాడి విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూడా తన వైఖరిని స్పష్టం చేయాలని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

స్వతంత్ర భారతదేశ శాసనసభల చరిత్రలోనే స్పీకర్ స్థానాన్ని ఇంతగా అవమానించిన ఘటన మరొకటి లేదని అధికార పక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టుకోవడం సభలోని అందరినీ కలచివేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనాలోచిత, అసభ్యకర వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకే గౌరవం ఉండదని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను కాపాడుకోవడానికి కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More