హైస్పీడ్ రైళ్లపై కీలక అప్డేట్.. శంషాబాద్‌లో ప్రధాన స్టేషన్, డిపో!
తెలంగాణలో హైస్పీడ్ రైలు గురించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 36వ మంత్రి మండలి సమావేశం జరిగింది. అనేక అంశాలమీద సుదీర్ఘంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తెలంగాణలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ కనెక్టివిటీపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. హైదరాబాద్-పుణె-ముంబయి, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై రూట్ హైస్పీడ్ రైళ్లను కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఎలైన్‌మెంట్, స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

శంషాబాద్ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్, డిపో కోసం 400 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫైనల్ ఎలైన్‌మెంట్‌ను హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో చేర్చాలని తెలిపింది. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, పలు శాఖల అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలు వంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆమోదించాలి. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటి వరకు సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదుకావడంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని అంచానా వేయడానికి ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆ జిల్లాలోని శాసన సభ్యులు , జిల్లా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించి ఆయా జిల్లాల వాతవరణ పరిస్థితులపై రిపోర్ట్ తయారు చేయాలని కేబినెట్ సూచించింది.
నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి ఎక్కడ అంతరాయం జరగకుండా తగిన చర్యలు చేపట్టేలా, రాష్ట్రంలో కరువుతో ఏర్పడిన ఆందోళన పరిస్థితులకు సంబంధించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకునేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి, రైతులందరికి పంటల విషయంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన సూచనలను, వర్షపాతం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర కేబినెట్ సూచించింది.
ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాల నిల్వలు సమృద్ధిగా ఉంచి, వాటి పంపిణీలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా రైతులకు సకాలంలో అందించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సారథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులతో కూడిన బృందం ఉమ్మడి పదిజిల్లాలు పర్యటించి వారి సూచనలను అందించేలా, రైతులకు పంటల విషయంలో మరింత అవగాహన కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.
ధరణి అవకతవకలపై ఇప్పటికే ఫొరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత వచ్చిన నివేదికల ఆధారంగా ధరణి ఏర్పడిన (అక్టోబర్ 2020) నాటి నుండి నేటి వరకు వచ్చిన ఆరోపణలు, అవకతవకలపై పూర్తి విచారణ కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం (S E T) ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ శాఖలలో, కార్పోరేషన్ల పరిధిలో ఇంజనీరింగ్ పనుల టెండర్ల ప్రకియలో ఉన్న విధివిధానాలను మార్చుతూ.. ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చేలా చట్టం తీసుకురానుంది. దీని కోసం అనుభవజ్ఞుల నిపుణులతో కమీటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థల టెండరు ప్రక్రియలో ఉండే విధివిధానాలను కూడ పరిగణలోకి తీసుకుని ఉన్నత విధానాలను అవలంబించేలా చట్టం రూపంలో జీవో నెం.94 ను సవరించాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ లో కో ఆప్షన్స్ సభ్యులు ఐదుగురు ఉన్నారు, అదనంగా ఒకరు (5+1) ట్రాంజెండర్ ని కూడ చేర్చేలా 2019 చట్ట సవరణ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలలో పన్నుల రూపంలో వచ్చే నిధులను ట్రెజరీలో జమచేసే విధానాన్ని మారుస్తూ.. ఆ గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న బ్యాంక్ లలో డిపాజిట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ 2018 చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగమై నిర్మాణంలో ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు గత కేబినెట్ భూసేకరణకు ఆమోదం తెలిపింది, ఇప్పడు మిగిలిపోయిన EPC పనులకు DPR తయారు చేయాలని ఈ కేబినెట్ లో నిర్ణయించింది.
ధర్మపురి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 29 పోస్టుల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా పంటలు వేయడానికి ముందు నీళ్ల వసతులను ఆధారాంగా చేసుకుని తగిన పంటలు వేయాలని రాష్ట్ర రైతులను కేబినెట్ కోరింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


