Komuravelli Railway Station : కొమరవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్… త్వరలోనే రైల్వే స్టేషన్ ప్రారంభం!
Komuravelli Railway Station : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల కోసం నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆధునిక వసతులతో ఈ రైల్వే స్టేషన్ సిద్ధమైంది.
Komuravelli Railway Station : లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవం కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ నిర్మించిన "కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్" త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులకు నేరుగా రైలు ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.
కొమరవెల్లి క్షేత్రానికి రైలు కనెక్టివిటీని పెంచేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.63 కోట్ల నిధులను కేటాయించింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌కు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే 99.5 శాతం పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. మిగిలిన స్వల్ప పనులను కూడా వేగంగా పూర్తి చేసి, త్వరలోనే ఈ స్టేషన్‌ను భక్తుల కోసం ప్రారంభించనున్నారు.
రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు, వసతులు
భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
- సుందరమైన ప్రవేశ ద్వారంతో (పోర్టికో) కూడిన స్టేషన్ భవనాన్ని నిర్మించారు.
- రైలు ఎక్కడానికి, దిగడానికి వీలుగా 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో భారీ హై-లెవెల్ ప్యాసింజర్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశారు.
- ఎండ, వానల నుంచి రక్షణ కోసం ప్లాట్‌ఫారమ్‌పై ఐదు అధునాతన షెల్టర్లను ఏర్పాటు చేశారు.
- ప్రయాణికులు వేచి ఉండటానికి విశాలమైన వెయిటింగ్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చారు.
- ప్లాట్‌ఫారమ్‌పై కూర్చోవడానికి వీలుగా త్రీ-సీటర్ బెంచీలను అమర్చారు.
- టికెట్ల జారీ కోసం ఆధునిక బుకింగ్ కౌంటర్లను సిద్ధం చేశారు.
- స్టేషన్ వెలుపల వాహనాల రాకపోకల కోసం విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, ప్రత్యేక పార్కింగ్ వసతులను కల్పించారు.
- ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికుల కోసం సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.
- మహిళలు, పురుషులతో పాటు దివ్యాంగుల (దివ్యాంగజన్) కోసం ప్రత్యేకంగా ఆధునిక శౌచాలయాలను నిర్మించారు.
- స్టేషన్‌కు చేరుకోవడానికి వీలుగా రోడ్లను చక్కగా అభివృద్ధి చేశారు.
- స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్టేషన్ భవన ముఖద్వారాన్ని (ఆర్కిటెక్చరల్ ఎలివేషన్) తీర్చిదిద్దారు.
- కొమరవెల్లి మల్లన్న స్వామి వైభవాన్ని, స్థానిక అడవులు, జంతుజాలాన్ని (ఫ్లోరా అండ్ ఫౌనా) ప్రతిబింబించేలా గోడలపై అద్భుతమైన మురళీ చిత్రాలను (మ్యూరల్ పెయింటింగ్స్) వేయించారు.
ఈ కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు పలు ప్రయోజనాలు కలగనున్నాయి. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇకపై నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. స్టేషన్‌లో కల్పించిన ఆధునిక వసతుల వల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా ఆధ్యాత్మిక పర్యాటకం (రిలిజియస్ టూరిజం) పెరగడంతో పాటు వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా స్టేట్ హైవే-1కి ఈ స్టేషన్ దగ్గరగా ఉండటంతో వల్ల…. రైలు దిగిన భక్తులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా అనుసంధానత (లాస్ట్-మైల్ కనెక్టివిటీ) మెరుగవుతుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఈ కొత్త రైల్వే స్టేషన్ పనుల పూర్తిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడమే కాకుండా, ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి, స్థానిక ఆర్థిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

