Telangana : కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం - అప్లికేషన్ ఎలా చేసుకోవాలి..? అర్హతలేంటి..? పూర్తి సమాచారం

Cheyutha Pension Applications Telangana : రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. అర్హతలు, ఆదాయ పరిమితులు, కావాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….

Published on: Aug 8, 2026, 11:33:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Cheyutha Pension Applications Telangana : రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. చేయూత పథకం కింద నూతన సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను శనివారం(ఆగస్ట్ 8, 2026) నుంచి ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 15 నుంచి నూతన పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు.

కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం (image source X)
కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం (image source X)

ముఖ్యంగా ఈ దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి చివరి తేదీ (లాస్ట్ డేట్) లేదని…. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి అర్హులైన ప్రతీ ఒక్కరూ నిశ్చింతగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఎవరికి ప్రాధాన్యం…? అర్హులు వీరే…

సామాజిక భద్రతను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కొన్ని వర్గాలకు ప్రాధాన్య క్రమంలో పింఛన్లు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

  • ఒంటరి మహిళలు, వితంతువులు
  • గీత కార్మికులు, చేనేత కార్మికులు
  • ఫైలేరియా (బోదకాలు) బాధితులు
  • డయాలసిస్ ప్రొసీజర్ పొందుతున్న బాధితులు
  • దివ్యాంగుల కేటగిరీ కింద థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వంటి జన్యుపరమైన, తీవ్రమైన రక్తం సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న బాధితులు.

ఆదాయ పరిమితులు…. నిబంధనలు

పింఛను పొందే లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కొన్ని ఆర్థిక పరిమితులను విధిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది. అర్హత ఉన్న వారికే పింఛన్ మంజూరు చేయాలని స్పష్టం చేసింది.

  • గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
  • పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికైతే వార్షిక ఆదాయ పరిమితి రూ. 2 లక్షలుగా నిర్ణయించారు.
  • దరఖాస్తుదారులకు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి (సాగు భూమి) లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఆస్తి ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు.

ఎవరెవరు అనర్హులు….?

  • ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు, అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు పింఛనుకు అనర్హులు.
  • వైద్యులు (డాక్టర్లు), కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు.
  • రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, పెట్రోల్ పంపులు, బోర్వెల్ రిగ్గుల యజమానులు, వారి తల్లిదండ్రులు.
  • ఇదివరకే ప్రభుత్వం నుంచి ఇతర సామాజిక భద్రతా పింఛన్ లేదా స్వాతంత్య్ర సమరయోధుల (ఫ్రీడమ్ ఫైటర్) పింఛను పొందుతున్న వారు.

పింఛనుకు దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

  1. ముందుగా 'చేయూత' అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  2. ఫారమ్‌లో కోరిన వివరాలన్నింటినీ స్పష్టంగా నింపి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను (ఆధార్, ఆదాయ ధ్రువీకరణ, వైద్య ధ్రువీకరణ పత్రాలు మొదలైనవి) జతచేయాలి.
  3. గ్రామీణ ప్రాంతాల వారు అయితే…. నింపిన ఫారాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజాపరిషత్ (MPDO) కార్యాలయంలో అందజేయాలి.
  4. పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు అయితే వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు లేదా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో సమర్పించాలి.

పాత దరఖాస్తుదారులు మళ్లీ అప్లై చేయాలా?

గతంలోనే పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తమ పాత దరఖాస్తులు ప్రభుత్వ రికార్డుల్లో పెండింగ్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి స్థానిక పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డు అధికారులను సంప్రదించి ఒకసారి సరిచూసుకోవాలని సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More