ఇవాళ తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల భేటీ - తుమ్మిడిహెట్టిపై కీలక చర్చలు..! ప్రయత్నాలు ఫలించేనా..?

ఇవాళ తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ అనుమతులు, ఎత్తు వివాదంపై చర్చలు జరపనున్నారు.

Published on: Oct 26, 2026, 05:12:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి ఎదురవుతున్న సరిహద్దు అనుమతుల చిక్కుముడులను విప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి అన్ముల రేవంత్ రెడ్డి ముంబై చేరుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇవాళ ఉదయం ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ వివాదమేంటి..?

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల పొరుగున ఉన్న మహారాష్ట్ర భూభాగాలు నీట మునిగే అవకాశం ఉండటంతో, ఆ రాష్ట్ర అధికారిక సమ్మతి తెలంగాణకు అత్యంత ఆవశ్యకంగా మారింది.

ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ నీటి నిల్వ ఎత్తు (FRL) విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే సానుకూలత వ్యక్తం చేసింది. కానీ, ఉత్తర తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలు పూర్తిగా నెరవేరాలంటే బ్యారేజ్ ఎత్తును 150 నుంచి 152 మీటర్ల వరకు పెంచాలని తెలంగాణ సర్కార్ గట్టిగా పట్టుబడుతోంది.

గ్రావిటీ ద్వారా నీరు..

బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లుగా ఖరారు చేస్తే, అక్కడి నుంచి నేరుగా గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారానే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించడం సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల నీటిని ఎత్తిపోసేందుకు అయ్యే భారీ విద్యుత్ వినియోగంతో పాటు, పంపింగ్ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల పథకం లక్ష్యాలను పునరుద్ధరించి.... ఉత్తర తెలంగాణ జిల్లాలకు సమృద్ధిగా సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ అంతర్రాష్ట్ర జల వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్ 29న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి, క్లియరెన్సులు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజ్ నిర్మించేందుకు రెండు రాష్ట్రాల మధ్య త్వరితగతిన ఒప్పందం కుదిర్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇచ్చిన సూచనలు, సాంకేతిక నివేదికల ఆధారంగా ఇప్పుడు నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More