తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో చర్చలకు సిద్ధమవ్వాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Published on: Oct 23, 2026, 20:25:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన, అటవీ ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న కీలకమైన ద్వైపాక్షిక చర్చలకు పూర్తిస్థాయి సాంకేతిక ఆధారాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఈ నెల 23వ తేదీ తర్వాత ప్రాజెక్టు చర్చల నిమిత్తం ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో పాటు ఇరిగేషన్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై చర్చలు…

సమీక్షలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీటి తరలింపు సాధ్యాసాధ్యాలు, ముంపు ప్రభావంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.

152 మీటర్ల ఎత్తున బ్యారేజీని నిర్మిస్తే సుమారు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని అధికారుల అంచనా. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ముంపు ప్రభావం 1,000 ఎకరాల లోపే ఉంటుందని విశ్లేషించారు.

గతంలో 148 మీటర్ల ఎత్తుకే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ… అంత తక్కువ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణకు ఆశించిన స్థాయిలో నీరు లభించదని సీఎం గుర్తుచేశారు. అందుకే 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించేలా నీటి లభ్యత, సాంకేతిక నివేదికలు, ముంపు అంచనాలతో కూడిన పక్కా వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) వద్ద జరిగిన సమావేశాల నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. 'జల్, జంగిల్, జమీన్' నినాదంతో పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు.

ఇదే సమావేశంలో సుదీర్ఘకాలంగా పీఠముడిగా మారిన డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల నీటి కేటాయింపులపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. డిండి ప్రాజెక్టు (DLIS) కోసం ఏదుల రిజర్వాయర్ నుండి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతలకు 0.1 టీఎంసీల చొప్పున మొత్తం 0.6 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ అదనపు 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుండి సేకరించి……. నార్లాపూర్ మీదుగా ఏదుల రిజర్వాయర్‌కు తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు.

పంప్‌హౌస్‌ల ఏర్పాటు, ప్రస్తుత కాల్వలు, సొరంగాల సామర్థ్యం పెంపుపై తక్షణమే అధ్యయనం జరిపి నూతన డిజైన్లు సిద్ధం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపులకు ఎలాంటి కోత పడకుండా, అదనపు నీటిని మాత్రమే ఈ రెండు ప్రాజెక్టులకు మళ్లించేలా మధ్యేమార్గాన్ని సీఎం ప్రతిపాదించగా…. సమావేశంలో ఉన్న మంత్రులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More