...
...
Next Story

మాకు చెప్పకుండానే ఏకగ్రీవం చేశారు.. ఆ జిల్లాలో గ్రామస్తుల పోలింగ్ బహిష్కరణ!

తెలంగాణలో మెుదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు పోలింగ్‌కు దూరంగా కూడా ఉన్నారు.

Published on: Dec 11, 2025, 11:54:08 IST
Advertisement

తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూలో నిలబడటంతో అనేక గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 11 గంటల నాటికి 52 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న చాలా మంది ఓటర్లు తమ ఓటు వేయడానికి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల మెదటి విడత పోలింగ్
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల మెదటి విడత పోలింగ్

అయితే కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేశారని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఎన్నికలను బహిష్కరించారు.

పెద్ద గోకుల్ తండా వాసిని వేలం పాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారని చిన్న గోకుల్ తండా వాసులు చెప్పారు. దీనిని నిరసనగా ఓట్లు వేయకుండానే తండాల్లో ఉండిపోయారు. చిన్న గోకుల్ తండాకు ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నల్గొండ జిల్లా చిట్యాల్ మండలం ఉరుమడ్ల గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కంచెర్ల భూపాల్ రెడ్డి, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.

కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌లో రెండు వర్గాలు రాళ్లు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. నలుగురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తర్వాత, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మం. మిర్యాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌కు గుండెపోటు వచ్చింది. సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు పోలీసులు. హెడ్‌కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేటకు తరలించారు.

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 86 సర్పంచ్ పదవులు, కామారెడ్డి జిల్లాలో 78 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవిని రూ.52 లక్షలకు కొనుగోలు చేశారని, ఉప సర్పంచ్ పదవిని రూ.15 లక్షలకు కొనుగోలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చందూర్ మండలంలోని లక్ష్మాపూర్‌లో కూడా ఇలాంటివి వినిపించాయి. అక్కడ సర్పంచ్ పదవికి రూ.45 లక్షలు, ఉప సర్పంచ్ పదవికి రూ.10 లక్షలు ఖర్చయిందని గ్రామస్తులు చెబుతున్నారు. వీటితోపాటుగా కమ్యునిటీ భవనాలు, భూమి విరాళం లాంటి హామీలు కూడా ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారట.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe