రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలలో శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న ప్లాట్లలో జీ+1 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 400 చ.అ.లోపు స్థలంలో కార్పెట్ ఏరియా 323 చ.అ.లకు తక్కువ కాకుండా జీ+1 విధానంలో ఇంటిని నిర్మించుకునే వెసులుబాటు లబ్ధిదారులకు దక్కనుంది.

ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బుధవారం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లోనివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింపచేస్తున్నామని అన్నారు.
కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జీవో ఎంస్ నె 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు, స్థలాల కొరత ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేశాామని వివరించారు.
“60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లుతో జీవిస్తున్నారు. వీరికి ఆర్ సిసి స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదు. ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో జి ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతినిచ్చాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తున్న రూ. 5 లక్షల ఆర్ధిక సహాయాన్ని దశల వారీగా నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందజేస్తాం” అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
ఇంటి నిర్మాణం ఎలా ఉండాలంటే.…?
- జి+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో , 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి.
- ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్ రూంలు తప్పనిసరిగా ఉండాలి.
- ఈ ఇంటి నిర్మాణం ఆర్ సిసి స్లాబ్ తో ఉండాలి. ఇందుకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్లకు డిఇఇ (హౌసింగ్)అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
- మొదటి అంతస్తు – రూఫ్ లెవల్ వరకు నిర్మాణం అయితే రూ. 1 లక్ష , అటు తరువాత గ్రౌండ్ ఫ్లోర్ – రూఫ్ వేసిన తరువాత రూ.1 లక్ష చెల్లిస్తారు. ఆపైన ఫస్ట్ ఫ్లోర్ లో కాలమ్స్, స్లాబ్, గోడల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణపు పూర్తి అయిన తరువాత మరో లక్ష రూపాయలను విడుదల చేస్తారు.