ఇటీవలనే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేసిన తెలంగాణ సర్కార్… తాజాగా ఫార్మసీ కాలేజీల ఫీజులను కూడా ఫైనల్ చేసింది. బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ జీవో నెంబర్ 10ని జారీ చేసింది. ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) పంపిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సర్కార్… ఈ జీవోను విడుదల చేసింది.
- రాష్ట్రంలో మొత్తం మొత్తం 120 బీ ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో గతంతో పోలిస్తే 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెరిగాయి.
- బీ ఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు ఫీజుగా నిర్ణయించారు.
- గతంలో కేవలం 3 కాలేజీల్లో మాత్రమే లక్ష రూపాయలకు పైగా ఫీజు ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 6కు చేరింది.
- రాష్ట్ర వ్యాప్తంగా 103 కాలేజీల్లో ఫీజు రూ.50 వేలు దాటింది.
- 17 కాలేజీల్లో మాత్రమే రూ.45వేల నుంచి రూ.49,500లోపు ఫీజులు ఉన్నాయి.
- గురునానక్ టెక్నికల్ క్యాంపస్ కు రూ. 1.21 లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత సీఎంఆర్ రూ. - 1.10 లక్షలు, విష్ణు ఇన్‌స్టిట్యూట్ రూ. 1,06,400గా ఉంది. ఇక సుల్తాన్ ఉలూమ్ రూ, 1,05,800, పుల్లారెడ్డి రూ. 1,02,600, రూ. గీతాంజలి - 1,00,800, ఎస్.ఎన్.వనితా మహావిద్యాలయకు రూ. లక్షగా నిర్ణయించారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 79 ఫార్మా డీ కాలేజీలు ఉన్నాయి. ఆయా కోర్సుల్లోని ఫీజులు చూస్తే… గీతాంజలి కాలేజీలో అత్యధికంగా రూ. 1,37,500గా నిర్ణయించారు. ఆ తర్వాత గురునానక్ రూ. 1,37,500, శ్రీదత్త కాలేజీ రూ. 1,26,500, శ్రీ ఇందులో రూ. 1.10 లక్షలుగా ఉంటుంది.
- రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కాలేజీలు 8 ఉన్నాయి. వీటిలో అశోకా కాలేజీలో అత్యధికంగా రూ.1.32 లక్షల ఫీజు ఉంది.

మరోవైపు ప్రస్తుతం టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో కూడా ప్రవేశాలను కల్పిస్తారు. ఆయా కాలేజీల ఫీజుల విషయంలో ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో… ఈసారి ముందుగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల ఫీజులను ఖరారు చేసింది. ఫలితంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఫీజుల విషయంలో స్పష్టమైన అవగాహన వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.