Free Sewing Machine Scheme : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ - నియోజకవర్గానికి 1,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు!
Telangana Free Sewing Machine Scheme : బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను పంపిణీ చేయనుంది. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Telangana Free Sewing Machine Scheme : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని భావిస్తోంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలు స్వయం ఉపాధి పొంది, తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడమే లక్ష్యంగా ‘ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బలహీన వర్గాల మహిళల ఉత్పాదకతను పెంచి, వారిని స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమైన వివరాలను వెల్లడించారు.
నియోజకవర్గానికి వెయ్యి మంది...
ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,000 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వీరికి 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను అందజేస్తారు. అంటే లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే అధునాతన కుట్టు యంత్రాలను సొంతం చేసుకోవచ్చు. టైలరింగ్‌ను కేవలం వృత్తిగా కాకుండా, ఒక వ్యాపార అవకాశంగా విస్తరించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనుంది.
పథకం అమలు తీరుపై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమాయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు మరియు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, వారిలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ, దరఖాస్తులు
ఈ పథకానికి సంబంధించి త్వరలోనే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ఎంపిక ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరగనుంది. స్థానిక నియోజకవర్గాల వారీగా అర్హులైన బీసీ మహిళల వివరాలను సేకరించి, వారికి తగిన శిక్షణతో పాటు యంత్రాలను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఆసరాగా నిలుస్తుందని, తద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఈ పథకం ద్వారా పంపిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

