Cheyutha Pensions : చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన తెలంగాణ సర్కార్

Cheyutha Pensions Application : చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Aug 31, 2026, 21:54:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. చేయూత పథకం కింద నూతనంగా మంజూరు చేయనున్న సామాజిక పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 2.50 లక్షల మంది అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ఈ నెల 9వ తేదీన శ్రీకారం చుట్టింది. అయితే ప్రాథమికంగా నిర్ణయించిన ఆఖరి తేదీ నాటికి వివిధ కారణాల వల్ల చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఆగస్టు 31వ తేదీని దరఖాస్తు చివరి తేదీగా ప్రభుత్వం పేర్కొంది. ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం.. ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను పారదర్శకంగా తనిఖీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. గ్రామీణ ప్రాంతాలలో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. పట్టణ, నగర ప్రాంతాలలో మున్సిపల్ బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి లబ్ధిదారులను ఖరారు చేస్తారు.

అర్హులైన నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, నిజమైన లబ్ధిదారులకే ఈ పథకం ఫలాలు అందేలా పక్కా నిబంధనలతో జాబితాను తయారు చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం కింద ప్రధానంగా ఆసరా అవసరమైన విభిన్న వర్గాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు.

దరఖాస్తుదారులు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, వయస్సు ధృవీకరణ పత్రం (వృద్ధులకు), సదరం (SADAREM) మెడికల్ సర్టిఫికెట్ (దివ్యాంగులకు), భర్త మరణ ధృవీకరణ పత్రం(వితంతువులకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్‌లు సంబంధిత అధికారులకు ఇవ్వాలి.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకుని, సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇప్పటివరకు అందిన దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే.. సమాజంలో ఆర్థిక ఆసరా అవసరమైన వితంతువుల నుంచి అత్యధిక స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన 4,34,854 దరఖాస్తుల్లో ఒక్క వితంతు పింఛన్ల కోసమే 2,64,815 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వితంతువులు: 2,64,815, దివ్యాంగులు: 1,07,171, ఒంటరి మహిళలు: 26,057, గీత కార్మికులు: 26,343, చేనేత కార్మికులు: 10,468 మంది దరఖాస్తు చేసుకున్నారు.

జిల్లాల వారీగా చూస్తే... హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 27,554 దరఖాస్తులు రాగా, ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా 3,620 మంది తమ దరఖాస్తులను అధికారులకు సమర్పించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More