తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు - 3 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

Published on: Nov 29, 2025, 15:11:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

“తరలిరండి – ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి..” అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీ (Bharath Future City) లో జరగనున్న ఈ సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ - సర్కార్ భారీ ఏర్పాట్లు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ - సర్కార్ భారీ ఏర్పాట్లు

3 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు…

హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలనే నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ , ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ , పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నట్టు ఇప్పటికే సమాచారం పంపించారు.

యూఏఈ రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, రస్ అల్ ఖైమా (RasAlKhaimah) ప్రతినిధులు, డుయిష్ బోర్సే (Deutsche Börse) గ్రూప్ హెడ్ లుడ్విగ్ హింజెల్మన్ (Ludwig Heinzelmann) గారు , ఎన్రిషన్ (Enrission) వ్యవస్థాపక భాగస్వామి విన్స్టన్ (Winston) గారు, మాండయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ (Mandai WildLife) గ్రూప్ సీఈఓ బెన్నెట్ నియో ( Bennett Neo) గారితో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

‘2047 నాటికి వికసిత్ భారత్ - జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రం తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది.

ఈ లక్ష్యాలను.. ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి..’ అని ముఖ్యమంత్రి పేరిట సందేశంతో ఆహ్వాన లేఖలు పంపించారు.

తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది.

హైదరాబాద్ కు లియోనెల్ మెస్సీ..

రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. తర్వాత ఈనెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలువనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More