...
...
Next Story

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రారంభం!

తెలంగాణలో ప్రభుత్వోద్యోగులకు న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రారంభమైంది. 17.88 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరనుంది.

Updated on: Jul 17, 2026, 17:31:05 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు భారీ ఊరటనిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలిసి అత్యంత పారదర్శకమైన, నగదు రహిత వైద్య సేవలను అందించే న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(NEHS) ను అధికారికంగా ప్రారంభించారు.

తెలంగాణ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్
తెలంగాణ న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్

ఈ సందర్భంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్(EHCT) డీడ్‌ను ఆవిష్కరించడంతో పాటు, NEHS వెబ్ పోర్టల్‌ను, లబ్ధిదారుల డిజిటల్ హెల్త్ కార్డ్‌లను విడుదల చేశారు. ఈ నూతన ఆరోగ్య పథకం కింద లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 ప్రైవేట్, 114 ప్రభుత్వ ఆసుపత్రుల్లో (మొత్తం 1000 ఆసుపత్రులు) రూపాయి ఖర్చు లేకుండా నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఇందులో అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కామినేని, కాంటినెంటల్, కేర్, స్టార్, బసవతారకం వంటి ప్రముఖ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఉన్నాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ సరికొత్త హెల్త్ స్కీమ్ ద్వారా మొత్తం 17,88,336 మంది లబ్ధి చేకూరనుంది. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు 4,38,594, పెన్షనర్లు 3,61,955, ఆధారపడిన కుటుంబ సభ్యులు సుమారు 9.88 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

ఈ పథకానికి ఉద్యోగులు, పెన్షనర్లు అందించే విరాళానికి సమానమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా జమ చేస్తుంది. ఈ నిధులన్నీ కేవలం ఈ పథకం కోసమే కేటాయిస్తారు. గత ఈహెచ్‌ఎస్ (EGS) పథకంలో తక్కువ ప్యాకేజీ ధరలు, క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌లో ఆలస్యం, కార్పొరేట్ ఆసుపత్రుల నిరాకరణ వంటి లోపాలు ఉండేవి. వాటన్నింటినీ అధిగమించి, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తరహాలో 1,816 మెడికల్, సర్జికల్ ప్యాకేజీలతో ఈ సరికొత్త NEHSని రూపొందించారు. దీని నిర్వహణ కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో ప్రభుత్వ అధికారులతో పాటు 10 మంది ఉద్యోగుల ప్రతినిధులు, ముగ్గురు పెన్షనర్ల ప్రతినిధులు ఉంటారు.

ఇదే రోజున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖలో ఎంపికైన 247 మంది నూతన నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలపై పెట్టే ఖర్చు మానవ వనరులపై చేసే దీర్ఘకాలిక పెట్టుబడి అని, ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 76,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. వైద్య రంగ బలోపేతానికి మరో 120 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 6 డెంటల్ సర్జన్లు, 99 ఫార్మసిస్ట్లు, 34 ల్యాబ్ టెక్నీషియన్లు, 54 ఏఎన్ఎం పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.

రాష్ట్రంలో నిమ్స్ విస్తరణ పనులతో పాటు సనత్ నగర్, ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్‌లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని, తద్వారా 44,029 బెడ్ల సామర్థ్యంతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks