మ్యూచువల్ ఫండ్స్: 40% రిటర్న్స్ చూసి పెట్టుబడి పెడుతున్నారా? ఈ తప్పు చేయకండి
గత ఏడాది భారీ లాభాలు అందించిన మ్యూచువల్ ఫండ్స్ వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అయితే, కేవలం గత పనితీరు, ర్యాంకింగుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఏటా మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్‌లు, రిటర్న్స్ టేబుల్స్ విడుదల కాగానే పెట్టుబడిదారులలో ఒక రకమైన ఆశ పుడుతుంది. ఏదైనా స్మాల్-క్యాప్ ఫండ్ 30 నుంచి 40 శాతం లాభాలు ఇచ్చిందనో, లేదా ఒక థీమాటిక్ ఫండ్ ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసిందనో వినగానే.. మన డబ్బును కూడా ఆ ఫండ్స్‌లోకి మార్చాలనే ఆలోచన వస్తుంది. కానీ, ఇలా కేవలం గతాన్ని చూసి నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

“నిన్నటి విజేతలు రేపు కూడా విజేతలుగా నిలుస్తారని నమ్మడం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులలో అతిపెద్ద పొరపాటు” అని ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ దేబాశిష్ మొహంతీ పేర్కొన్నారు.
రిటర్న్స్ టేబుల్స్ దాచే నిజాలు
కేవలం ఒక ఏడాది రిటర్న్స్ చూసి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే అవి గడిచిన కాలానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే చూపిస్తాయి.
"ఒక సంవత్సరం రిటర్న్స్ అనేవి మార్కెట్‌లోని ఒక నిర్దిష్ట పరిస్థితిని, ఆ సమయంలో ఏ రంగానికి ఆదరణ ఉందో మాత్రమే ప్రతిబింబిస్తాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది అవి చెప్పలేవు" అని ఫండ్స్ ఇండియా సీఈఓ రిషభ్ గార్గ్ వివరించారు.
ఫండ్స్ ఇండియా చేసిన పరిశోధనల ప్రకారం.. ఒక ఏడాది టాప్ పొజిషన్‌లో ఉన్న ఫండ్స్‌లో కేవలం నాలుగింటిలో ఒకటి (25 శాతం) మాత్రమే తర్వాతి మూడేళ్లపాటు ఆ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాయి. మిగిలినవి వెనుకబడిపోతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న మార్కెట్ పరిస్థితులు, రంగాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని దేబాశిష్ మొహంతీ స్పష్టం చేశారు.
గరిష్ట స్థాయిల్లో కొనుగోలు చేసే ప్రమాదం
ఒక ఫండ్ టాప్ ర్యాంకుకు చేరిందంటే, అది ఇప్పటికే ఆయా స్టాక్స్ లేదా రంగాలలో భారీ లాభాలను ఆర్జించిందని అర్థం. ఇన్వెస్టర్లు ఆ విషయాన్ని గమనించే సమయానికే వాటి వాల్యుయేషన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.
"చాలామంది చేసే పెద్ద తప్పు.. మార్కెట్ గరిష్టాల్లో ఉన్నప్పుడు కొనుగోలు చేయడం. గత ఏడాది టాప్ ఫండ్ ఇప్పటికే వేగంగా దూసుకెళ్లింది. ఇప్పుడు అందులోకి ప్రవేశించడం అంటే ఆ రంగం లేదా సైకిల్ ముగింపు దశలో ఎంటర్ అవ్వడమే" అని రిషభ్ గార్గ్ హెచ్చరించారు.
గ్రో మ్యూచువల్ ఫండ్ సీఈఓ వరుణ్ గుప్తా మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు కేవలం లాభాలనే చూస్తారు తప్ప, ఆ లాభాల వెనుక ఉన్న కారణాలను పట్టించుకోరని అన్నారు. పోర్ట్‌ఫోలియో నిర్మాణం, పెట్టుబడి విధానం, రిస్క్ ప్రొఫైల్, స్థిరమైన ప్రదర్శన వంటి కీలక అంశాలను మర్చిపోతారని చెప్పారు. రెండు ఫండ్స్ ఒకే రకమైన రిటర్న్స్ ఇచ్చినప్పటికీ, అందులో ఒక ఫండ్ ఎక్కువ రిస్క్ తీసుకుని ఉండవచ్చని మొహంతీ గుర్తుచేశారు.
ఎస్‌ఐపీలను మార్చడం వల్ల నష్టాలు
కొంతకాలం పాటు ఒక ఫండ్ సరిగ్గా రాణించకపోతే, వెంటనే ఆ ఎస్‌ఐపీ (SIP) ఆపేసి కొత్తగా లాభాలు ఇస్తున్న ఫండ్‌లోకి మారడం పెట్టుబడిదారులకు అలవాటు. ఇది దీర్ఘకాలిక లాభాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
"ఇన్వెస్టర్లు తరచూ ఒకే తప్పు చేస్తుంటారు. ఒక ఫండ్ 12 నుంచి 18 నెలలు సరిగ్గా రాణించకపోతే దాన్ని ఆపేసి, గత ఏడాది టాప్ విన్నర్ ఫండ్‌లోకి మారతారు. కట్ చేస్తే.. పాత ఫండ్ మళ్లీ పుంజుకుంటుంది, కొత్తగా మారిన ఫండ్ పక్కకు వెళ్ళిపోతుంది" అని రిషభ్ గార్గ్ తెలిపారు.
దీనివల్ల ఇన్వెస్టర్లు మార్కెట్ సైకిల్‌లో రెండు వైపులా తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా పదే పదే ఫండ్స్ మార్చడం వల్ల ఎస్‌ఐపీ క్రమశిక్షణ దెబ్బతింటుందని వరుణ్ గుప్తా అన్నారు. రికవరీకి సిద్ధంగా ఉన్న ఫండ్స్ నుంచి ముందే బయటకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనికి తోడు ఇలా ఫండ్లు మార్చడం వల్ల పన్నులు, ఎగ్జిట్ లోడ్స్, లావాదేవీల ఖర్చులు పెరుగుతాయని దేబాశిష్ మొహంతీ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల ప్రకారం.. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇన్వెస్టర్ల రిటర్న్స్ తగ్గిపోతున్నాయి.
ఏ కేటగిరీల్లో జాగ్రత్తగా ఉండాలి?
కొన్ని ఫండ్ కేటగిరీలలో ఇలాంటి పొరపాట్లు చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందులో స్మాల్-క్యాప్ ఫండ్స్ మొదటి వరుసలో ఉంటాయి. బుల్ మార్కెట్‌లో ఇవి భారీ లాభాలను చూపిస్తాయి, కానీ వాల్యుయేషన్లు పెరిగినప్పుడు రిస్క్ కూడా అంతే ఉంటుంది. సెక్టోరల్, థీమాటిక్ ఫండ్స్ కూడా ఇలాంటివే.
"సెక్టార్ ఫండ్స్ వెనుక పరిగెత్తే ఇన్వెస్టర్లు మార్కెట్ టైమింగ్‌తో పాటు ఆయా పరిశ్రమల సైకిల్‌ను కూడా అంచనా వేయాలని చూస్తుంటారు, ఇది చాలా కష్టం" అని రిషభ్ గార్గ్ పేర్కొన్నారు.
థీమాటిక్ ఫండ్స్‌లో మార్కెట్ సెంటిమెంట్ మారినప్పుడు పనితీరులో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయని వరుణ్ గుప్తా హెచ్చరించారు. ఇంటర్నేషనల్ ఫండ్స్ విషయానికొస్తే కరెన్సీ హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక సైకిల్స్ ప్రభావం చూపుతాయని, అందుకే గత పనితీరును నమ్మలేమని మొహంతీ చెప్పారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ర్యాంకింగ్‌ల వెనుక పడటం కంటే, తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఏ ఫండ్ సరిపోతుందో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
"గత ఏడాది టాప్ ర్యాంక్ సాధించిందనే కారణంతో కాకుండా, ఇన్వెస్టర్ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చగల సామర్థ్యం ఆధారంగానే ఫండ్‌ను ఎంచుకోవాలి" అని వరుణ్ గుప్తా స్పష్టం చేశారు.
నిజమైన సవాలు గత ఏడాది విజేతను గుర్తించడం కాదు, ఆ విజేత వెనుక పరిగెత్తకుండా క్రమశిక్షణతో పెట్టుబడులను కొనసాగించడమే.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


