...
...
Next Story

ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టం చేస్తాం - సీఎం రేవంత్ కీలక ప్రకటన

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టం తెస్తామని ప్రకటించారు.వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేస్తామని అన్నారు.

Published on: Dec 21, 2025, 06:03:27 IST
Advertisement

ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టం తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇతర మతాలను కించపరిచేట్టు మాట్లాడిన వారిని శిక్షించే విధంగా వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు క్రిస్టియన్ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. మత ప్రాతిపదికన దాడులకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. అలాంటి ఘటనలను ప్రభుత్వం కఠినంగా అణిచివేసిందని, అన్ని మతాలకు సమాన హక్కును స్వేచ్ఛను కల్పిస్తామని అన్నారు.

సీఎం రేవంత్ ప్రసంగం - ముఖ్యమైన అంశాలు:

  • “శాంతిని ఇవ్వాలి, ప్రేమను పంచాలన్న ఏసు ప్రభువు ఇచ్చిన గొప్ప సందేశం స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఏసు ప్రభువు స్ఫూర్తితో తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు శాంతిని, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోంది. మానవ సేవయే మాధవ సేవ అని భావించి ప్రేమను పంచాలని, శాంతిని పెంచాలని ఏసు క్రీస్తు చాటారు.
  • ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల ప్రభువు ఆరాధకులకు మాత్రమే కాదు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌కు కూడా ఒక మిరకిల్ మాసం. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ప్రకటన వెలువడటమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కూడా డిసెంబర్ నెలలోనే.
  • ఎవరెన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం.
  • క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి పేదలకు ఎంతో అంకిత భావంతో, ప్రభుత్వంతో పోటీ పడి పేదలకు ఉదాత్తమైన సేవలు అందిస్తున్నాయి.
  • మైనారిటీలకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి ఎవరి దయ కాదు. అది వారి హక్కు. ఆ హక్కులను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తాం. ఊరికి కొంత దూరమైనప్పటికీ స్మశాన వాటికలను ఏర్పాటు చేస్తాం.
  • నూతన సంవత్సరం గొప్ప మార్పును తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్ 2047 తో నిర్దేశించుకుని లక్ష్యాలను సాధించడానికి, అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాం. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే రోల్ మాడల్‌గా నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనకు మీరందరూ ఆశీర్వాదం అందించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks