MLC Voter Registration : ఇవాళ్టి నుంచి నవంబర్ 6 వరకు గ్రాడ్యుయేట్స్ ఓటర్ల రిజిస్ట్రేషన్

MLC Voter Registration : తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి మెుదలవుతుంది. అర్హులైనవారు ఆన్‌లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

Published on: Sep 28, 2026, 07:18:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలోని రెండు కీలక పట్టభద్రుల(గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు సంబంధించిన ఓటర్ల నమోదు నోటిఫికేషన్‌ను అధికారులు అధికారికంగా సోమవారం జారీ అవుతుంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 2027తో ముగియనుండటంతో, కొత్తగా ఓటర్ల జాబితా తయారీకి ముందస్తుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబరు 1 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన పట్టభద్రులు నవంబరు 6 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఓటరు నమోదు కోసం ఫారం-18 నింపాల్సి ఉంటుంది. పట్టభద్రులు సులభంగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల యంత్రాంగం రెండు రకాల అవకాశాలను కల్పించింది.

ఆన్‌లైన్ నమోదు విధానం ద్వారా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్ ceotelangana.nic.in లోకి వెళ్లాలి. 'Graduate MLC Voter Registration (Form-18)' ఆప్షన్‌ను ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి. డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ కాపీ, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ స్కాన్ చేసిన ప్రతులను అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని అవసరమైన ధ్రువీకరణ పత్రాల కాపీలతో స్థానిక ఎన్నికల అధికారులకు అందించాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్ విధానం ద్వారా జిల్లా కలెక్టరేట్లు, ఆర్‌డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఫారం-18 పత్రాలు లభిస్తాయి. ఫారాన్ని పూర్తి చేసి, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన సర్టిఫికేట్ల నకళ్లను జతచేసి నేరుగా లేదా పోస్టు ద్వారా అధికారులకు పంపవచ్చు. రెండు నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాలు ఈ నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను గుర్తించేందుకు మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని గ్రామాల వారీగా సర్వేలు చేపడుతున్నారు. పట్టభద్రులు ఆన్‌లైన్ నమోదు వైపు మొగ్గు చూపుతుండటంతో, మండల కేంద్రాల్లో ప్రత్యేక ల్యాప్‌టాప్‌లు, స్కానర్లతో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగా, పట్టభద్రుల ఓటర్ల నమోదు పక్కాగా జరిగేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More