...
...
Next Story

TG High Court : భిన్న వైఖరి ఎందుకు...? టీజీపీఎస్సీ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి... స్థానికత నిర్ధారణపై కీలక తీర్పు!

ఉద్యోగ నియామకాల స్థానికతపై టీజీపీఎస్సీ అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. అభ్యర్థిని స్థానికుడిగా గుర్తించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ధర్మాసనం సమర్థించింది.

Published on: Jun 23, 2026, 09:46:06 IST
Advertisement

ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతను నిర్ధారించే విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అవలంబిస్తున్న విధానాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక్కో అభ్యర్థి విషయంలో కమిషన్ ఒక్కో రకమైన నిబంధనలను తెరపైకి తీసుకురావడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

ఒక సందర్భంలో వరుసగా నాలుగేళ్లు స్థానికంగా చదవలేదనే నెపంతో అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ…. మరో సందర్భంలో 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణేతర ప్రాంతంలో చదువుకున్నారనే కారణాన్ని చూపుతూ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన పద్ధతులను, నిర్ధారిత మార్గదర్శకాలను పాటించడంలో కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆక్షేపించింది. రాజ్యాంగబద్ధమైన నియామక సంస్థ అయిన టీజీపీఎస్సీ ఇటువంటి ధోరణిని వీడి….. స్థానికత నిర్ధారణలో అందరికీ ఏకరీతిగా వర్తించేలా స్థిరమైన ప్రమాణాలను పాటించాలని హితవు పలికింది.

కేసు వివరాలు ఇలా…

ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) నియామకం కోసం టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియలో నిశాంత్ అనే అభ్యర్థి 1 నుంచి 7వ తరగతి వరకు ఏపీలో చదివారనే కారణాన్ని చూపుతూ కమిషన్ ఆయన స్థానికతను నిరాకరించింది. దీనిని సవాలు చేస్తూ నిశాంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గతంలో విచారించిన సింగిల్ జడ్జి.. పిటిషనర్‌ను తెలంగాణ స్థానికుడిగానే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన తీర్పునిచ్చారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు-2018లోని పేరా 7లో ఉన్న నిబంధనలను అధికారులు విడివిడిగా కాకుండా అన్నింటినీ కలిపి చదవాలని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం నిబంధనలను మాత్రమే కాకుండా…. వాటి వెనుక ఉన్న అసలైన అంతరార్థాన్ని, వ్యాఖ్యానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

ఒక అభ్యర్థి విషయంలో వరుసగా నాలుగేళ్ల పాటు చదువుకోలేదనే కారణాన్ని ముందుకు తెస్తున్న కమిషన్…. మరో అభ్యర్థి విషయంలో 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ వెలుపల చదివారనే కారణాన్ని చూపుతోందని ధర్మాసనం గుర్తుచేసింది. అభ్యర్థికి వ్యతిరేకంగా ఫలితాన్ని రప్పించడమే లక్ష్యంగా ఇలా నిమిషానికో కారణాన్ని మార్చడం చూస్తుంటే.. కమిషన్ తన ఆలోచనా శక్తిని ఉపయోగించడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది.

రాజ్యాంగబద్ధమైన ఒక ప్రభుత్వ సంస్థగా టీజీపీఎస్సీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. స్థిరమైన ప్రమాణాలను పాటించాలని, నియామకాలను ఆలస్యం చేసే అనవసర న్యాయ వివాదాలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. కమిషన్ తీసుకునే ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

స్పష్టమైన చట్టబద్ధమైన ఆదేశాలు లేకుండా…. కేవలం మారుతున్న కారణాలతో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తూ కోర్టులలో వ్యాజ్యాలు నడపడం వల్ల విలువైన సమయం, ప్రజా వనరులు వృథా అవ్వడమే కాకుండా అభ్యర్థుల ఉద్యోగ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను న్యాయస్థానం ఎంతమాత్రం అనుమతించబోదని స్పష్టం చేసింది.

అభ్యర్థి ఏ కనీస అర్హత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారో… ఆ పరీక్ష రాసిన సంవత్సరంతో ముగిసే వరుసగా నాలుగు విద్యాసంవత్సరాల పాటు ఎక్కడ చదివారనే అంశం ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలనే నిబంధనలోని ప్రాధాన్యతను కమిషన్ అర్థం చేసుకోవాలని సూచించింది.ఈ క్రమంలో పిటిషనర్ స్థానికతపై టీజీఎస్పీసీ ఇచ్చిన వివరణలను పక్కనపెడుతూ… సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ కమిషన్ దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks