తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితంగా వైద్యారోగ్యశాఖలో కీలకమైన 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఫలితాలకు సంబంధించిన వివరాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB వెబ్ సైట్ లో ఉంచారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత…. రాత పరీక్షలను నిర్వహించారు. గతేడాది డిసెంబర్ లోనే ‘ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్’ను రిలీజ్ చేశారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. మిగతా ప్రక్రియలు కూడా పూర్తి కావటంతో… తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారితో పాటు పరీక్ష రాసిన మిగిలిన అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను అందుబాటులో కూడా వెబ్ సైట్ లో ఉంచారు. ఫలితంగా అభ్యర్థులు వారి మెరిట్ వివరాలను నేరుగా చూసుకునే అవకాశం కల్పించారు.
నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి:
- అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని నర్సింగ్ ఆఫీసర్ సెలక్షన్ లిస్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందొచ్చు.
గడిచిన రెండేళ్లుగా తెలంగాణ వైద్యారోగ్య నుంచి అనేక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్, ఫ్రొఫెసర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్స్ తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిక్రూట్ మెంట్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీతో పాటు ఖాళీలపై ఆరా తీస్తున్నారు.