తెలంగాణ నాయకపోడు గిరిజన మాస్క్‌లకు జీఐ ట్యాగ్ వచ్చే అవకాశం.. వీరు కాకతీయుల నుంచి వెలుగులోకి!

తెలంగాణ నాయకపోడు గిరిజన మాస్క్‌లకు జీఐ ట్యాగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకపోడు మాస్క్‌లకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.

Updated on: Oct 16, 2025, 09:11:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో నివసిస్తున్న నాయకపోడు తెగ ప్రత్యేకమైన చేతితో తయారు చేసే మాస్క్‌లకు భౌగోళిక గుర్తింపు (GI) ట్యాగ్‌ను పొందే అవకాశం ఉంది. ఈ మాస్కులకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల నుంచి వీటిని తయారు చేస్తున్నారు. కాకతీయ రాజు సింగభూపాల నుంచి ఈ తెగ వారు ఎక్కువగా వెలుగులోకి వచ్చారు.

నాయకపోడు మాస్క్‌లకు జీఐ ట్యాగ్ వచ్చే అవకాశం (X)
నాయకపోడు మాస్క్‌లకు జీఐ ట్యాగ్ వచ్చే అవకాశం (X)

నాయకపోడు మాస్క్‌లకు జీఐ ట్యాగ్ సాధించడానికి, నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ మద్దతుతో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్(IPFC)లో GI రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన జీఐ ప్రాక్టిషినర్ శుభజిత్ సాహా, జీఐ రిజిస్ట్రేషన్ కోసం లీగల్ కౌన్సిల్ శ్రీవత్సను కలిసి దరఖాస్తు చేసుకున్నారు.

నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అధ్యక్షుడు పసుల అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఇది తమ తెగకు ఒక మలుపు కావచ్చని అన్నారు. ఇది నాయకపోడు కళలు, చేతిపనులను రక్షించడంలో సహాయపడటమే కాకుండా, పురాతన హస్తకళ రూపాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో కూడా సహాయపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అంజన్ 11 సంవత్సరాల క్రితం సొసైటీని స్థాపించారు. సొసైటీ సభ్యులు మాస్క్‌లను తయారు చేయడంలో, వాటిని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) ద్వారా మార్కెటింగ్ చేయడంలో నిమగ్నం చేస్తున్నారు. వాటిని పలు వేదికలలో ప్రదర్శిస్తున్నారు.

నాయకపోడు తెగ తెలంగాణలోని గోదావరి నది ఒడ్డున ప్రధానంగా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో స్థిరపడ్డారు. కానీ కాలక్రమేణా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించారు. వీరు 14వ శతాబ్దపు రేచర్ల పద్మనాయక రాజవంశ పాలకుడు సర్వజ్ఞ సింగ భూపాలుడికి సేవ చేశారని నమ్ముతారు. భీముడి భార్య హిడింబి తమ ఆడపడుచు అని, భీముడు తమకు చిరుధాన్యాలు పండించడం నేర్పించాడని చెప్పుకుంటున్నారు. అందుకే వారు పాండవులను కొర్రాజులు అని పిలుస్తారు. ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి గ్రామదేవతలుగా వ్యవహరిస్తారు.

ఈ మాస్క్‌లు ఎలా తయారు చేస్తారు?

నాయకపోడు మాస్క్‌లను పొనికి చెట్టు చెక్కతో తయారు చేస్తారు. రంగు రాళ్ళు, చెట్ల సారం, బొగ్గు, బూడిద, అటవీ వనరుల నుండి సేకరించిన సహజ రంగులను మాత్రమే ఉపయోగించి వారు తమ చేతులతో మాస్క్‌లను తయారు చేస్తారు. వీరు ప్రధానంగా కాకతీయ రాజు సింగబోయడు (సింగభూపాలుడు), భూలక్ష్మి దేవర, ఐదుగురు పాండవులు (కొర్రాజులు), పోతరాజు, వరాహ రాజు, ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి, అశ్వం (గుర్రం), ఒక జింక ముఖానికి మాస్క్‌లుగా తయారు చేస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More