TG School Whatsapp Services : ప్రోగ్రెస్ రిపోర్టుల నుంచి స్కాలర్‌షిప్స్ వరకు..! వాట్సాప్‌లోనే స్కూల్ అప్‌డేట్స్

Telangana  School Whatsapp Services : తెలంగాణ విద్యాశాఖ, మీసేవ సంయుక్తంగా వాట్సాప్ ద్వారా పాఠశాల విద్యా సేవలను ప్రారంభించాయి. ఈ సరికొత్త విధానంతో 18 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు నేరుగా ఫోన్లకే సమాచారం అందనుంది.

Published on: Jun 20, 2026, 09:50:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana School Whatsapp Services : డిజిటల్ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. సాంకేతికతను సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ, పాఠశాల విద్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేరుగా విద్యార్థులు, తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకే చేరవేసేలా విద్యాశాఖ సరికొత్త వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం
వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం

ఐటీ శాఖ పరిధిలోని మీసేవా విభాగం సహకారంతో రూపొందించిన ఈ వినూత్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల విద్యా ప్రగతిని పర్యవేక్షించడంలో ఈ విధానం ఒక మైలురాయిగా నిలవనుంది.

18 లక్షల మందికి పైగా నేరుగా లబ్ధి

ఈ విప్లవాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యాశాఖ అందించే సేవలను వాట్సాప్ ద్వారా సులభంగా పొందనున్నారు. పాఠశాలల పనితీరు, పరీక్షల షెడ్యూల్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా సామగ్రి పంపిణీ వంటి కీలక సమాచారం ఎప్పటికప్పుడు చేరనుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా…. ఇతరుల అవసరం లేకుండా పూర్తి పారదర్శకంగా, వేగంగా సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు ఇవే:

ప్రస్తుతం ప్రాథమిక దశలో భాగంగా విద్యార్థులకు అత్యవసరమైన పలు రకాల సేవలను వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా అందిస్తున్నారు.

  • విద్యార్థుల వార్షిక, త్రైమాసిక ప్రోగ్రెస్ రిపోర్టులు
  • పరీక్షల హాల్ టికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం
  • వార్షిక పరీక్షల మార్కుల మెమోలు, ఫలితాల సమాచారం
  • ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) ఒరిజినల్, డూప్లికేట్ మెమోలు
  • పాఠశాలల నుంచి పొందే బోనఫైడ్, ట్రాన్స్ ఫర్ (టీసీ) సర్టిఫికెట్లు
  • పదో తరగతి మార్కుల మెమోల్లో తప్పుల సవరణల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం

ఈ సేవలు డిజిటల్ రూపంలోకి రావడం వల్ల సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల సమయం ఆదాతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా మిగిలాయి.

త్వరలోనే మరిన్ని సేవలు సిద్ధం

రెండో దశలో భాగంగా ఈ వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రోజుల్లో కింది సేవలను సైతం మొబైల్ స్క్రీన్లపైకి తీసుకురానున్నారు:

  • ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఉచిత యూనిఫాంల పంపిణీ స్టేటస్
  • విద్యార్థుల రోజువారీ హాజరు శాతం (అటెండెన్స్) వివరాలు
  • ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియ, నిధుల విడుదల సమాచారం
  • మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్స్) అమలు తీరు, మెనూ వివరాలు
  • విద్యార్థుల కోసం నిర్వహించే ఆరోగ్య శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షల అప్‌డేట్స్
  • పాఠశాల స్థాయి క్రీడలు, సాంస్కృతిక పోటీల సమాచారం
  • గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాలు
  • విద్యా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి నేరుగా అభిప్రాయ సేకరణ (ఫీడ్‌బ్యాక్)

డిజిటల్ మస్కట్‌గా ‘పాలపిట్ట’

ఈ డిజిటల్ సేవల ప్రచారంలో భాగంగా ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి అయిన ‘పాలపిట్ట’ను ఈ ప్రాజెక్టుకు డిజిటల్ మస్కట్‌గా ఎంపిక చేశారు. విద్యాశాఖ అందించే ముఖ్యమైన సమాచారం, ప్రభుత్వ పథకాలపై అవగాహన, విద్యా సంబంధిత వీడియోలను పాలపిట్ట యానిమేషన్ క్యారెక్టర్ల రూపంలో వాట్సాప్‌లో పంపిస్తారు. కార్టూన్ తరహాలో ఉండే ఈ యానిమేషన్ల వల్ల చిన్న పిల్లలకు, గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులకు ప్రభుత్వ సమాచారం సులభంగా అర్థమవడమే కాకుండా…. ఎంతో ఆకర్షణీయంగా నచ్చుతుందని అధికారులు భావిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More