తెలంగాణలో టీచర్ల కోసం ఏడాదికి రెండు సార్లు ప్రత్యేక టెట్.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు!
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ఏడాదికి రెండు సార్లు ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల (In-Service Teachers) కోసం ఏడాదికి రెండు సార్లు ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Special TET) నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న టీచర్లు సైతం కచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందేనంటూ సెప్టెంబరు 2025లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మొదట రెండేళ్ల గడువు ఇచ్చినప్పటికీ, ఇటీవల అత్యున్నత న్యాయస్థానం దీనిని మరో ఏడాది పొడిగించింది. దీని ప్రకారం.. ఇన్ సర్వీస్ టీచర్లు అందరూ 2028 ఆగస్టు నాటికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి అయింది.
దేశంలోని కొన్ని రాష్ట్రాలు తమ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహిస్తున్నాయని, అదే తరహాలో తెలంగాణలోనూ జరపాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఉపాధ్యాయుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుద్యోగుల కోసం సాధారణంగా ఏటా నిర్వహించే రెండు టెట్‌లతో సంబంధం లేకుండా, పనిచేస్తున్న టీచర్ల కోసం ప్రత్యేకంగా పరీక్షలు జరపాలని నిర్ణయించింది.
విద్యాశాఖ వర్గాల అంచనా ప్రకారం.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు ఇంకా టెట్ అర్హత లేదు.
2026 జనవరిలో జరిగిన టెట్ పరీక్షకు వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 65,605 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా.. అందులో 37,893 మంది ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన వారు రాబోయే పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంది.
రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఈనెల 15వ తేదీ నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పరీక్ష రాయడానికి నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి మొత్తం 1.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం సర్వీస్‌లో ఉండి టెట్ కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు 28,149 మంది ఉన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ఉపాధ్యాయులకు భవిష్యత్తులో ప్రమోషన్లు పొందడానికి, అలాగే సుప్రీంకోర్టు గడువులోగా ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగ భద్రతను కాపాడుకోవడానికి ఈ ప్రత్యేక టెట్ ఎంతగానో దోహదపడనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


