Telangana SSC Original Marks Memo 2026 : తెలంగాణలో పదో తరగతి పూర్చి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక అప్‌డేట్ అందించింది. టెన్త్ ఒరిజినల్ మార్కుల జాబితాల (లాంగ్ మెమోలు) పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ మేరకు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లను నేరుగా సంబంధిత పాఠశాలలకే పంపిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే. లింగయ్య శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
స్కూళ్లకు వెళ్లి పొందొచ్చు…

వార్షిక పరీక్షలతో పాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరి ఒరిజినల్ మెమోలను విద్యాశాఖ సిద్ధం చేసింది. శనివారం నుంచే ఈ సర్టిఫికెట్లను అన్ని బడులకు రవాణా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను (హెచ్‌ఎం) నేరుగా సంప్రదించి… తమ ఒరిజినల్ లాంగ్ మెమోలను పొందవచ్చని సూచించారు.
పైౌ చదవుల్లో భాగంగా ఉన్నత కోర్సుల ప్రవేశాలు, ఇతర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ఒరిజినల్ సర్టిఫికెట్లు అత్యంత కీలకమైనవి. దీంతో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ పాఠశాలలకు వెళ్లి హెచ్‌ఎంల ద్వారా ఒరిజినల్ మెమోలను తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న (ఇంప్రూవ్‌మెంట్) విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షార్ట్ మెమోలు వచ్చినప్పటికీ… తాజాగా లాంగ్ ఒరిజినల్ మెమోలను విద్యాశాఖ స్కూళ్లకు అందజేసింది.
టెన్త్ ఫలితాలు చూసుకోవడం ఎలా?
- ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in ఓపెన్ చేయండి.
- హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే ఫలితాల లింక్స్ పై క్లిక్ చేయండి.
- మీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) ఎంటర్ చేయండి.
- వివరాలు ఇచ్చాక 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.