కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల ప్రకృతి అందాలను ఆకాశమార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువవనుంది. ఆ దిశగా తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా…. సోమశిల - శ్రీశైలం క్షేత్రాల మధ్య 'హేలీ టూరిజం' సేవలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనుంది.
హైదరాబాద్ నుంచి జర్నీ…

హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుంది. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు.
ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువవస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
రానున్న రోజుల్లో ఈ సేవలను కేవలం సోమశిలకే పరిమితం చేయకుండా నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు కూడా విస్తరించనున్నారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
ప్యాకేజీ వివరాలు:
- ఈ హేలీ టూరిజంలో భాగంగా రెండు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. మొదటి ప్యాకేజీలో హెలికాప్టర్ ప్రయాణం, వీఐపీ తరహాలో దైవదర్శనం ఉంటుంది. ఒక్కరికి రూ.1,10,000 చార్జీగా నిర్ణయించారు.
- ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో హెలికాప్టర్ బయల్దేరుతుంది. ఉదయం 7 గంటలకు సోమశిలకు చేరుకుంటుంది. సోమశిల కృష్ణానది అందాలను వీక్షిస్తారు. అక్కడ ఉన్న లలితాంబిక సోమేశ్వరం ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం ఉంటుంది.
- ఉదయం 8.30 గంటలకు హెలికాప్టర్ సోమశిల నుంచి బయలుదేరి మధ్యాహ్నం 11.30 గంటల వరకు శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో వీఐపీ దర్శనం ఉంటుంది.
- మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్ అక్కడి నుంచి బయలుదేరి 12:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. దీంతో ఈ ప్యాకేజీ క్లోజ్ అవుతుంది.
- 2వ ప్యాకేజీ కింద రెండు రోజుల పాటు బస చేయవచ్చు. ఒక్కరికి రూ.1,40,000 చార్జీగా నిర్ణయించారు. విడిది గదులు, భోజన వసతితో పాటు అన్ని ఆలయాల్లో వీఐపీ తరహాలో దర్శనం ఉంటుంది.
- సోమశిలలో ఒక రోజు బస చేయటంతో పాటు శ్రీశైలంలో మరోక్క రోజు బస చేసేందుకు వసతులు, భోజనాలు ఉంటాయి.
- తెలంగాణ టూరిజం https://tourism.telangana.gov.in/heli-tourism వెబ్ సైట్ లో ఈ వివరాలను చెక్ చేసుకోవచ్చు.