Telangana Traffic Challans : చలాన్లపై కీలక అప్డేట్ - ఇకపై సాకులు చెప్పటం కుదరదు..! వెంటనే అప్డేట్ చేసుకోండి

రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల జారీ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారానే చలాన్లు పంపనున్నారు. వాహనదారులు నెల రోజుల్లో తమ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి.

Published on: Jun 2, 2026, 10:08:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో వాహనదారులకు రవాణా శాఖ అత్యంత కీలకమైన అప్డేట్ అందించింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జారీ చేసే చలాన్ల విధానంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులను అమలు చేయనుంది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం డిజిటల్ మాధ్యమాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇకపై వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లోనే ట్రాఫిక్ చలాన్లు
ఇకపై వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లోనే ట్రాఫిక్ చలాన్లు

వాట్సాప్, ఈ-మెయిల్‌కు చలాన్ నోటీసులు

కొత్త నిబంధనల ప్రకారం…. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు ఇకపై నేరుగా వారి మొబైల్ నంబర్లకు షార్ట్ మెసేజింగ్ సర్వీసెస్ (SMS), వాట్సాప్ (WhatsApp) లేదా వారి అధికారిక ఈ-మెయిల్ (e-mail) అడ్రస్‌లకు డిజిటల్ రూపంలో చలాన్ నోటీసులు అందుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని వాహన యజమానులందరూ ఈ నోటిఫికేషన్ విడుదలైన నెల రోజులలోపు తమ ప్రస్తుత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన 'వాహన్ పోర్టల్' (http://vahan.parivahan.gov.in) లో విధిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత… వాహన్ పోర్టల్‌లో నమోదై ఉన్న మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌కు పంపే ఎస్‌ఎంఎస్, వాట్సాప్ సందేశాలనే వాహనదారుడికి చేరిన అధికారిక చలాన్ నోటీసులుగా రవాణా శాఖ పరిగణిస్తుంది. సమాచారం అందలేదనే నెపంతో తప్పించుకోవడానికి వీలుండదు.

ఎందుకు ఈ మార్పు?

గతంలో చలాన్ల సమాచారం సకాలంలో అందకపోవడం వల్ల వాహనదారులు పెనాల్టీలు పేరుకుపోయిన తరుణంలో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నేరుగా నిత్యం వాడే వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం రావడం వల్ల వెంటనే చలాన్లను చెల్లించే అవకాశం కలుగుతుంది.

ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, రిజిస్టరింగ్ అథారిటీలను ప్రభుత్వం ఆదేశించింది. వాహనదారులు ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే తమ వివరాలను వాహన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం మంచిది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More