...
...
Next Story

హైదరాబాద్ మెటా ఆఫీసుపై యూత్ కాంగ్రెస్ దాడి.. 'బ్రాండ్ హైదరాబాద్' ప్రతిష్టకు దెబ్బ అంటూ కేటీఆర్, బీజేపీ ఫైర్!

Meta Office in Hyderabad : హైదరాబాద్ మెటా ఆఫీసుపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Updated on: Nov 21, 2026, 10:59:23 IST
Advertisement

సోషల్ మీడియా దిగ్గజం మెటా(Meta) హైదరాబాద్ కార్యాలయంపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు శుక్రవారం దాడి చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది. తమ జాతీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కార్యాలయంలోకి చొరబడిన కార్యకర్తలు పూలకుండీలను పగులగొట్టి వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ జాతీయ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మెటా ఆఫీసుపై దాడి
మెటా ఆఫీసుపై దాడి

తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్‌లోని మెటా కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి మెటా రాజకీయ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.

కార్యాలయ కారిడార్లు, కెఫెటేరియా సమీపంలోకి దూసుకెళ్లిన కొందరు కార్యకర్తలు అక్కడున్న పూలకుండీలను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇన్‌ఛార్జ్ మనీష్ శర్మ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై మెటా విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఘాటుగా స్పందించింది. మెటాకు "వెన్నెముక ఉండాలి" అని వ్యాఖ్యానిస్తూ, నిలిపివేసిన ఖాతాలు, పోస్టులను పునరుద్ధరించడానికి ఏడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. లేనిపక్షంలో కోర్టుల్లో, వీధుల్లో, కార్యాలయాల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

మరోవైపు ఇదే అంశంపై ముంబైలోని బీకేసీ వరల్డ్ వన్ వద్ద ఉన్న మెటా కార్యాలయం వెలుపల కూడా ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ షబ్రిన్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను విమర్శించే గొంతుకలను నొక్కేందుకే ఖాతాలను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ, కేంద్ర సమాచార, ప్రసార, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

మెటా కార్యాలయంపై జరిగిన దాడిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. 'దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న బ్రాండ్ హైదరాబాద్‌ను ఎన్నో ఏళ్ల కష్టంతో, వ్యాపార అనుకూల విధానాలతో నిర్మించుకున్నాం. భారత్‌లోనే మెటాకు అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. సురక్షితమైన పని వాతావరణం కల్పిస్తామని మేము ఇచ్చిన హామీతోనే వారు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటన కేవలం అద్దాలను మాత్రమే పగులగొట్టలేదు.. బ్రాండ్ హైదరాబాద్ నమ్మకాన్ని కూడా విచ్ఛిన్నం చేసింది.' అని ఆవేదన వ్యక్తం చేశారు. గూండాయిజం ద్వారానే రాహుల్ గాంధీ దేశానికి కంపెనీలను తీసుకువస్తారా అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను గూండాల పార్టీగా అభివర్ణించారు. 'యూత్ కాంగ్రెస్ గూండాలు మెటా కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, దాన్ని సోషల్ మీడియాలో గొప్పగా ప్రదర్శించుకుంటున్నారు. గతంలో వరల్డ్ ఏఐ సమ్మిట్‌లోనూ వీరు దేశ పరువు తీశారు. ప్రైవేట్ కంపెనీల కార్యాలయాలపై దాడులు చేయడమే కాంగ్రెస్ మోడల్. అందుకే కాంగ్రెస్ హయాంలో భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది.' అని విమర్శించారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks