...
...
Next Story

టెంపుల్ కారిడార్‌గా బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలు

బాసర నుంచి భద్రాద్రి వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలకు సరికొత్త తెచ్చేలా టెంపుల్ కారిడార్‌గా మారుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భవిష్యత్ తరాలు మెచ్చేలా భద్రాచలంలో పనులు చేపడుతున్నామన్నారు.

Published on: Nov 26, 2026, 06:05:47 IST
Advertisement

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన రాతి కట్టడాల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని పొంగులేటి అన్నారు. గోదావరి తీర ఆలయాలకు శోభ తీసుకొచ్చి.. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ కారిడార్ అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.

'పుష్కరాల అభివృద్ధి పనుల కోసం వివిధ శాఖల ద్వారా ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. భద్రాచలం దేవస్థానం మరో 200 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా నిలిచేలా శాశ్వత నిర్మాణాల కోసం రూ.300 కోట్లు కేటాయించాం. అవసరమైన అదనపు నిధులను కూడా సమకూరుస్తాం. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. ఆ శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం. రాబోయే ముక్కోటి ఏకాదశి నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రాద్రిని సిద్ధం చేయాలని, ఇందుకోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించాం.' అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

వీటితో పాటు పర్ణశాల ఘాట్ వద్ద ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, చర్ల మండలంలోని కుదునూరు, దేవరపల్లి గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్లను ప్రారంభం, చర్లలోని గిరిజన బాలికల వసతి గృహానికి నూతన డార్మెటరీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాను.

రూ.20 లక్షలతో బూర్గంపాడు మండలం వేపలగడ్డలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.12 లక్షల నిర్మాణ వ్యయంతో పోలవరంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -17 బాలుర రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

'ప్రజాప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా.. రెండు కళ్ళుగా భావించి ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం. ప్రతిపేదకుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, రూ.5 లక్షల జీవిత బీమాతో ఇందిరమ్మ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.' అని మంత్రి పొంగులేటి చెప్పారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks