సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’.. రాష్ట్రం నలుమూలల పర్యటన - సీఎం రేవంత్ ప్రకటన
తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కొడంగల్ లో పర్యటించిన ఆయన… వచ్చే సంక్రాంతి తర్వాత “ప్రజాబలం” కార్యక్రమం చేపట్టి రాష్ట్రం నలుమూలల పర్యటిస్తానని ప్రకటించారు.
గత ప్రభుత్వం చేసిన వేల కోట్ల అప్పులను చెల్లిస్తూనే… రాష్ట్రంలో ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని తెలిపారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన 'రైతన్నతో ఆత్మీయ సభ'లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రూ. 9,053 కోట్ల విలువైన పలు సంక్షేమ, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా చెబుతున్నా….
సభకు ముందు సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం రైతులతో కలిసి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం భావోద్వేగంగా మాట్లాడుతూ….. "గడిచిన 70 ఏళ్ల కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర అన్యాయానికి గురైంది. కరువు కాటకాలు, పనుల కోసం మైగ్రేషన్లతో మగ్గిపోయిన పాలమూరు రూపురేఖలను కచ్చితంగా మారుస్తాం. కొడంగల్ బిడ్డగా నాడు నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దు?" అని సూటిగా ప్రశ్నించారు.
2028 డిసెంబర్ నాటికి కృష్ణా నది జలాలతో కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి అంగుళం భూమిని తడిపి, పచ్చని పంటలు పండేలా చేయడం తన బాధ్యత అని ప్రకటించారు. "అందుకు పోలేపల్లి ఎల్లమ్మ అమ్మవారి మీద ఆన వేసి మాటిస్తున్నా," అని సీఎం స్పష్టం చేశారు.
పాలమూరు జిల్లా ఏనాడూ తగిన అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్లినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని, ఇక్కడి భూములు పంటలకు నోచుకోలేదని ధ్వజమెత్తారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు దశాబ్దాలు గడిచినా అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా పరిస్థితులు మారతాయని భావిస్తే తీవ్ర నిరాశే మిగిలిందని, ముఖ్యంగా మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదేళ్ల పాటు గత ప్రభుత్వం పక్కనపెట్టి తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు.
కొడంగల్ ప్రాంతంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు రాబోతున్నాయని, దీనికి ప్రజలందరూ కొండంత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ పారిశ్రామిక వాడ అభివృద్ధి ద్వారా వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్ నుంచి చేవెళ్ల, షాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాల వరకు విశాలమైన రహదారుల విస్తరణతో పాటు భారీ ఎత్తున పరిశ్రమలను తీసుకువస్తున్నట్లు వివరించారు.
సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ కార్యక్రమం
ప్రస్తుతం దేశాన్ని, రాష్ట్రాన్ని వేధిస్తున్న ఎల్నినో ప్రభావ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. వర్షపాతం తగ్గడం వల్ల తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ఈ విషయాన్ని గ్రహించి వరి స్థానంలో ఆరుతడి పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా ఈ ఎల్నినో సవాలును ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో బియ్యం కొరత రాకుండా ప్రభుత్వం వద్ద తగినన్ని ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఒక సీజన్లో వరి పండించకపోయినా సన్నబియ్యం గురించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా "ప్రజాబలం" పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రాష్ట్రం నలుమూలలా స్వయంగా పర్యటిస్తానని వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

