హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్…! రేపు (అక్టోబర్ 27) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద 800 మి.మీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. ఈ పనుల్లో సికింద్రాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉండనుంది.

మారేడ్‌పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఎంఎస్ పైప్‌లైన్‌ను స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానం చేస్తారు. కాబట్టి అక్టోబర్ 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 28 ఉదయం 6 గంటల వరకు 18 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి.
ఏ ఏ ప్రాంతాలంటే..?
ఈ పనుల కారణంగా… నల్లగుట్ట, ప్రకాశ్ నగర్, మేకలమండి, భోలక్‌పూర్, హస్మత్‌పేట తదితర ప్రాంతాలు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది. అంతేకాకుండా సౌత్ సెంట్రల్ రైల్వే, బేగంపేట విమానాశ్రయం, బాలంరాయి పంప్‌హౌస్, బాలంరాయి చెక్ పోస్ట్, బోయిన్ పల్లి, ఏవోసీ రైల్వే కాలనీ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది.
నీటి సరఫరా నిలిచిపోవటంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి, హెచ్ఎండీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు.