నర్సంపేటలో టెన్షన్.. టెన్షన్.. రోడ్లపైకి కార్మికులు.. ముత్తోజిపేటకు నేతలు

TGSRTC Strike : తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో కార్మికులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు పార్టీల కీలక నేతలు వరంగల్ జిల్లా నర్సంపేటకు వస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 24, 2026, 13:13:48 IST
By , Warangal
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో మెుదట వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ తరలించారు. శంకర్ గౌడ్ పరిస్థితి విషమించి మృతి చెందారు.

ముత్తోజిపేట దగ్గర ఉద్రిక్తత
ముత్తోజిపేట దగ్గర ఉద్రిక్తత

శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరిగాయి. అయితే ముత్తోజిపేట గ్రామంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతిమ నివాళులు అర్పించేందుకు ఆయన పార్థివ దేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చేరారు. కార్మికులతో పాటు పార్థివ దేహాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.

పోలీసులు జోక్యం చేసుకుని సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణతో ఆ ప్రాంతంలో ఆందోళన రేకెత్తించింది.

మరోవైపు నర్సంపేట మండలంలోని మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌ను ముందుకు పోనివ్వలేదు పోలీసులు. ఒకే వాహనం మాత్రమే వెళ్లాలని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు నివాళి అర్పించడానికి వెళితే ఇబ్బంది ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తంచేశారు.

నర్సంపేట సమీపంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి ఆగ్రహంతో ముత్తోజీపేట వెళ్లేందుకు అనుమతించారు పోలీసులు. కేంద్ర మంత్రి రాకతో నర్సంపేటకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నర్సంపేట నుండి వందలాది మందితో ముత్తోజీపేటకు బయలుదేరి వెళ్లారు.

నర్సంపేట ఆర్టీసీ డిపోకు శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని తరలించేదాకా కదిలేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. నర్సంపేట డిపోకు తీసుకెళితేనే శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్న ఆర్టీసీ కార్మికులు, కుటుంబ సభ్యులు అంటున్నారు. శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళితే పోలీసులకు అభ్యంతరం ఏమిటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

పోలీసులు పదేపదే అడ్డుకుని శవపేటికను రోడ్డుపైనే ఉంచడంతోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.శవ పేటిక తీసి శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నించారు కార్మికులు, బీజేపీ శ్రేణులు. శంకర్ గౌడ్ ఆత్మ చేకూరాలంటే నర్సంపేట డిపోకు తీసుకెళ్లాల్సిందేనని కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల విజ్ఝప్తి మేరకు ఆర్టీసీ డిపోకు తరలించాలని బండి సంజయ్ కోరారు. మరోవైపు నర్సంపేటకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More