పంచాయతీకే పైసల పవర్.. ట్రెజరీ కష్టాలకు చెక్.. గ్రామసభలో తీర్మానం చేస్తే చాలు

తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీకి జమ చేయాల్సిన అవసరం లేదు. స్థానిక అవసరాల కోసం నేరుగా వాడుకోవచ్చు.

Published on: Sep 11, 2026, 08:38:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని గ్రామ పంచాయతీల ఆర్థిక పురోగతికి, గ్రామీణ ప్రాంతాల స్వయం సమృద్ధికి బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు లభించే పన్నులు, ఇతర సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలతో నిమిత్తం లేకుండా నేరుగా స్థానిక బ్యాంకుల్లో జమ చేసుకుని అభివృద్ధి పనులకు వెచ్చించేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ‘తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) బిల్లు–2026’ అసెంబ్లీతో పాటు శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

గ్రామ పంచాయతీ
గ్రామ పంచాయతీ

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు తెలిపారు. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3)కి సవరణలు చేయడం ద్వారా గ్రామాల్లో నిధుల వినియోగానికి దశాబ్దాలుగా ఎదురవుతున్న అవరోధాలకు శాశ్వత పరిష్కారం లభించింది.

గ్రామాల్లో మురుగునీటి కాలవల శుభ్రత, తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులు, వీధిదీపాల ఏర్పాటు వంటి అత్యవసర పనులకు కూడా గతంలో నిధుల కొరత వేధించేది. స్థానికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఆ సొమ్మంతా ప్రభుత్వ ట్రెజరీలో జమ కావడం వల్ల నిధుల ఉపసంహరణకు తీవ్ర సమయం పట్టేది. ఈ సమస్యలను అధిగమించేందుకు తెచ్చిన నూతన సవరణ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

పంచాయతీల సొంత ఆదాయంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిధులను స్థానిక బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకోవచ్చు. గ్రామంలో ఏదైనా సమస్య ఎదురైతే, అధికారులు లేదా ఉన్నతాధికారుల అనుమతుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా స్థానిక గ్రామసభ తీర్మానంతో వెంటనే పనులు పూర్తి చేయవచ్చు. గతంలో కేవలం పట్టణ సంస్థలకు మాత్రమే ఉన్న ఈ నిధుల వెసులుబాటును ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించారు.

శాసనసభలో బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, పల్లెల సమగ్ర వికాసమే ప్రజా ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన 2025–26 ద్వితీయ విడత రూ. 619 కోట్ల గ్రాంట్లు నిలిచిపోయినప్పటికీ, విబి-జి రాంజీ (VB-G RAMJI) పథకం నిబంధనల వల్ల రాష్ట్రంపై రూ. 2,000 కోట్ల అదనపు భారం పడుతున్నా వెనకడుగు వేయడం లేదని చెప్పారు.

పల్లెల్లో అభివృద్ధి ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వమే రూ. 50 కోట్ల చొప్పున పంచాయతీలకు విడుదల చేస్తోందని వెల్లడించారు. దీనికితోడు మల్టీపర్పస్ వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందిస్తున్నామని, భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం వేగవంతం చేశామని వివరించారు. మండల కేంద్రాల అనుసంధానానికి డబుల్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, త్వరలోనే ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ అంశంపైనా సానుకూల నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.

బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష, అధికార పక్ష ఎమ్మెల్యేలు రేకులపల్లి భూపతిరెడ్డి, చింతకుంట విజయరమణారావు, గండ్ర సత్యనారాయణ రావు, పాల్వాయి హరీశ్ బాబు, వీర్లపల్లి శంకర్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఒక కీలక సూచన చేశారు. పంచాయతీ నిధులను డిపాజిట్ చేసే ప్రక్రియలో గ్రామీణ రంగానికి, రైతులకు అండగా నిలిచే కో-ఆపరేటివ్ (సహకార) బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అక్కడ మెరుగైన వడ్డీ రేట్లు కూడా లభిస్తాయని ప్రతిపాదించారు.

ఉభయ సభల ఆమోదం పొందిన ఈ పంచాయతీరాజ్ సవరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. గవర్నర్ సంతకం పూర్తి కాగానే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇది చట్టరూపం దాల్చుతుంది. ఈ చట్టసవరణతో గ్రామీణ ప్రాంతాల్లో పాలనా జాప్యానికి తెరపడి, వేగవంతమైన అభివృద్ధికి బాటలు పడతాయని ప్రజాప్రతినిధులు అంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More