...
...
Next Story

తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు మీ చేతికే.. లక్షలాది మందికి ప్రయోజనం

తెలంగాణలో సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులు తనఖా పెట్టిన పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించింది.

Updated on: Nov 16, 2026, 19:47:57 IST
Advertisement

తెలంగాణలోని పేద, మధ్యతరగతి గృహ నిర్మాణ పథకాల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం కోసం తనఖా పెట్టిన పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అమలైన వివిధ గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. ఆ సమయంలో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును మూడు విధాలుగా సమకూర్చేవారు. ప్రభుత్వ సబ్సిడీ, లబ్ధిదారుడి సొంత వాటా, బ్యాంకు రుణంగా ఇచ్చేవారు.

బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు ఆనాడు లబ్ధిదారులు తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను ప్రభుత్వ వద్ద తనఖా పెట్టారు. నిబంధనల ప్రకారం రుణ వాయిదాలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాత ఆ పత్రాలను తిరిగి లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. అయితే వివిధ పరిపాలనాపరమైన కారణాలు, సమన్వయ లోపం వల్ల రుణాలు తీరిపోయినప్పటికీ లక్షలాది మంది పేదల పట్టాలు దశాబ్దాలుగా తహసీల్దారు కార్యాలయాల్లోనే ఉండిపోయాయి

ఇటీవల రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితా(22A) సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో తహసీల్దారు కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది ఇళ్ల పట్టాల అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సొంత ఇళ్లు ఉన్నప్పటికీ, చేతిలో ఒరిజినల్ పట్టాలు లేకపోవడం వల్ల లబ్ధిదారులు తమ ఆస్తులపై పూర్తి హక్కులు పొందలేకపోతున్నారని, అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించుకోలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది.

ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పి, లబ్ధిదారులకు తమ ఇళ్లపై పూర్తి స్థాయి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఒరిజినల్ పత్రాలు చేతికి రావడం వల్ల ఆయా ఆస్తులకు సంబంధించిన రికార్డులు స్పష్టమవుతాయి. పిల్లల చదువులు, వివాహాలు లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం తమ ఆస్తి పత్రాలను ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.

త్వరలోనే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గ్రామ, మండల స్థాయిలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు గృహనిర్మాణ, రెవెన్యూ శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks