22A నిషేధిత భూముల దరఖాస్తులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

22A నిషేధిత భూముల దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరానికి కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు.

Published on: Nov 12, 2026, 21:11:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు, ఎదుర‌వుతున్న స‌మ‌స్యలపై హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి పొంగులేటి సమీక్ష
మంత్రి పొంగులేటి సమీక్ష

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22A భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు చెప్పారు. 22A సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల‌కు అనుగుణంగా జీవో 118, జీవో 76లకు సంబంధించి మెమోలు జారీ చేశామన్నారు.

ఆదేవిధంగా 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు, యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారం, నాలా ప్రక్రియ, జీవో 59 అమలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినట్టుగా పొంగులేటి గుర్తుచేశారు.

'ఇప్పటివరకు వ‌చ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ప్రతి వారం జిల్లా స్థాయిలో అధికారులు సమావేశమై 22A సమస్యల పరిష్కారంపై సమీక్షించాలి. జిల్లా స్థాయిలో పరిష్కరించడానికి వీలుకాని వాటిని ఉన్నతస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలని సూచించాను.' అని మంత్రి పొంగులేటి చెప్పారు.

అదేవిధంగా యూఎల్‌సికి సంబంధించి వివిధ కోర్టులు వెలువరించిన తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసే అంశాలు, ఎస్‌ఎల్‌పీలు దాఖలు చేయడానికి అవకాశం లేని ఇతర అంశాలన్నింటిపై వారం రోజుల్లోగా ఉన్నతస్థాయి కమిటీ సమగ్ర నివేదిక అందించాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి రెగ్యులరైజేషన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. అర్హులకు న్యాయం చేసే క్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు.

గురవారం మైలార్‌దేవ్‌పల్లిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిసి ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా పేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని విస్మరించ లేదని మంత్రి పొంగులేటి చెప్పారు. పక్షపాతానికి తావివ్వడం లేదు..ఎవరికి ఓటు వేశారు? ఏ పార్టీకి చెందినవారు? అని చూడటం లేదన్నారు. కేవలం సొంత ఇల్లు లేని నిరుపేదలై ఉంటే చాలు.. వారినే అర్హులుగా గుర్తించి, డ్రా తీసి, ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ టవర్లను వచ్చే దీపావళినాటికి పూర్తి చేసి అందిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More