విద్యార్థినులకు ఈవీ స్కూటీలు.. డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు

CM Revanth Reddy : కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామన్నారు.

Updated on: Mar 8, 2026, 15:56:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.

'దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి. వర్షాలొస్తే ముంబయి అతలాకుతలమవుతోంది. వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతమవుతోంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు, వరదలొచ్చినప్పుడు చెన్నై ప్రమాదకర పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ నివాసయోగ్యం కాని నగరంగా మారే పరిస్థితులు రావొద్దు. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్‌ నగరానికి తలెత్తకూడదనే ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్‌లో వాయు నాణ్యత(AQI) ఇప్పటికే ఆరెంజ్ కేటగిరీకి చేరింది. మరింత ప్రమాదకంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

మూసీ రివర్ ఫ్రంట్

హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోతోందని, దోమలు పెరిగాయనో, మూసీలో కాలుష్యం పారుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టకుండా అది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. నదుల్లో కాలుష్య నివారణకు ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎందుకు చేపట్టొద్దని అడిగారు.

సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ విషయంలో 2012 లో నిబంధనలు రూపొందించారన్నారు ముఖ్యమంత్రి. నాలా అయితే బఫర్ జోన్ ఎంతుండాలి? చెరువులైతే ఎంతుండాలి?నదులైతే ఎంతుండాలన్నది ఖరారు చేశారన్నారు. ఆ మేరకు మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని వెల్లడించారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్

'గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒక ఆపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య చర్చ జరుగుతోంది. 7 ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పాం. లేదా నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచించింది. మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1 లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 5 వేల కోట్లు, పది వేల కోట్లు వెచ్చిస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం దాదాపు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ది మొత్తంగా 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు

కాలుష్య నివారణలో భాగంగా 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో ఆర్టీసీ ద్వారా వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2800 బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయని, కాలుష్య నియంత్రణలో భాగంగా వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టామన్నారు.

ఈవీ స్కూటీలు

డీజిల్ వాహనాలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో డిసెంబర్ నాటికి నూరు శాతం ఈవీ బస్సులను ప్రవేశపెడుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈవీ వాహనాలకు జీరో పన్ను పాలసీ తెచ్చామన్నారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నామన్నారు.

నగరంలో 2 లక్షల ఆటోలున్నాయని, డీజిల్, పెట్రోల్ ఇతర ఇంధన ఆధారంగా నడుస్తున్న ఈ ఆటోలను రెట్రోఫిటింగ్ కింద ఈవీలుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని, నగరంలో కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలిస్తున్నామన్నారు.

రేవంత్ రెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..

  • 'దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జీడీపీలో 5 శాతం మేరకు దోహదపడుతున్న నేపథ్యంలో 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యాలను నిర్దేశించాం. 2047 నాటికి దేశ జీడీపీలో పది శాతం తెలంగాణ నుంచి దోహదపడాలి. ఈ లక్ష్యసాధనలో మహిళలు సంపూర్ణంగా సహకరించాలి.
  • మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే చోట మహిళలకు రక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేస్తాం. రక్షణ కల్పించడమే కాకుండా ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుంది. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపు విషయంలో ఎవరికీ అన్యాయం జరగదు.
  • మహిళలు ఆర్థికంగా ఎదిగిన కారణంగానే కొన్ని దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా నిలబడ్డాయి. సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షకు ముగింపు పలకాలంటే మహిళల శక్తిని గుర్తించి సమాన అవకాశాలు కల్పించాలి. మహిళల శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదు. కష్టపడే వారికి గుర్తింపునివ్వాల్సిన బాధ్యత అందరిపైనా ప్రభుత్వాలపైనా ఉంది.
  • దేశంలో అగ్రస్థానంలో తెలంగాణను నిలపాలన్న లక్ష్య సాధనలో మహిళా జర్నలిస్టుల సహకారం ఉండాలి. మహిళలకు ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చుకుందాం.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More