TS ICET Notification 2026 : తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 12 నుంచి దరఖాస్తులు

టీజీ ఐసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 13, 14 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.

Published on: Feb 06, 2026 3:13 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

తెలంగాణ ఐసెట్ 2026
తెలంగాణ ఐసెట్ 2026

ఈనెల 12 నుంచి దరఖాస్తులు…

టీజీ ఐసెట్ - 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 16 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 250 ఫైన్ తో మార్చి 30 వరకు, రూ. 500 ఫైన్ తో ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 5 వేల ఫైన్ తో మే 1, రూ. 10 వేల ఫైన్ తో మే 2,3 తేదీల్లో అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

టీజీ ఐసెట్ - 2026 రాత పరీక్షలను మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. సెషన్ 3 పరీక్ష మే 14, 2026 న సింగిల్ షిఫ్ట్ లో జరుగుతుంది.

టీజీ ఐసెట్ పరీక్షలను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 50 మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్కుల నిర్ణయం వర్తించదు. ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.

ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా ఐసెట్ కు మంచి స్పందన వస్తోంది. సీట్లకు కూడా చాలా డిమాండ్ ఉంటోంది.