నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు.. నవంబర్ 30లోపు అప్లై చేయండి
National Merit Scholarships : నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ గురించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులు, రెన్యువల్ చేసేవారి కోసం తేదీలు ప్రకటించింది.
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్(Central Sector Scholarship Scheme - CSSS) దరఖాస్తుల ప్రక్రియపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక ప్రకటన విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త, రెన్యూవల్ దరఖాస్తుల సమర్పణకు నవంబర్ 30, 2026 చివరి తేదీ అని బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ఉపకార వేతనాన్ని అందిస్తున్నారు. 2026లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో (IPE 2026) ఉత్తీర్ణులై, టాప్ 20 పర్సంటైల్‌లో నిలిచిన విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత విద్యా సంవత్సరాల్లో ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికై, ప్రస్తుతం ఉన్నత చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులు 2026-27 సంవత్సరానికి తమ దరఖాస్తులను రెన్యూవల్ చేసుకోవాలి.
IPE 2026 ఫలితాల ఆధారంగా తెలంగాణ నుంచి మొత్తం 66,358 మంది విద్యార్థులు తాత్కాలికంగా టాప్ 20 పర్సంటైల్ జాబితాలో అర్హత సాధించారు. కేటగిరీల వారీగా అర్హుల సంఖ్య చూసుకుంటే.. జనరల్ 19,567, ఓబీసీ 36,866, ఎస్సీ 9,023, ఎస్టీ 5,446, దివ్యాంగులు 136 మంది.. మొత్తంగా 66,358 మంది ఉన్నారు. అర్హత సాధించిన విద్యార్థుల పూర్తి జాబితాను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbienew.cgg.gov.in లో అందుబాటులో ఉంచారు.
దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30, 2026గా ఉంది. కాలేజీ నోడల్ ఆఫీసర్ వెరిఫికేషన్ చివరి తేదీ డిసెంబర్ 15గా నిర్ణయించారు. విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ http://scholarships.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉన్న టాప్ 20 పర్సంటైల్ జాబితాలో తమ రోల్ నంబర్ ఉందో లేదో సరిచూసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత, సంబంధిత ధృవపత్రాలను (ఆధార్, ఇంటర్ మార్కుల మెమో, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్, బోనఫైడ్ సర్టిఫికెట్) తమ కళాశాలలోని ఇన్‌స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్‌కు అందజేసి, డిసెంబర్ 15 లోపు ఆన్‌లైన్ వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి.
చివరి తేదీ వరకు వేచి చూడకుండా, సర్వర్ సమస్యలు రాకముందే వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే బోర్డు ఫోన్ నంబర్ (040-24603314) ద్వారా సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


