తెలంగాణ ఇంటర్ బోర్డు రద్దు కాబోతోందా? 10 ప్లస్ 2తో ప్రైవేట్ కాలేజీల పరిస్థితేంటి?
తెలంగాణలో ప్రతిపాదించిన 10 ప్లస్ 2 విద్యావిధానంపై ఇంటర్ బోర్డుకు చెందిన ఓ అధికారి మాట్లాడారు. చాలా మంది ఇంటర్ బోర్డు రద్దు అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలపై కూడా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.
తెలంగాణ విద్యావ్యవస్థలో రాబోతున్న 10 ప్లస్ 2 విధానంపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. కొత్త విధానం అమల్లోకి వచ్చినా ఇంటర్ బోర్డును పూర్తిగా రద్దు చేసే ఆలోచన లేదని, అయితే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల పనితీరులో మాత్రం భారీ మార్పులు తప్పవని స్పష్టం చేశారు.

కొత్త విధానంలో ఇంటర్ బోర్డు ఉండదనే ప్రచారాన్ని ఆ అధికారి కొట్టిపారేశారు. పరీక్షలు నిర్వహించే విభాగాల పేరు మారవచ్చేమో కానీ, వాటి పనితీరు యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి (ఇంటర్ సెకండియర్) బోర్డు పరీక్షలు నిర్వహించడానికి కచ్చితంగా ఒక వ్యవస్థ ఉండాల్సిందేనని పేర్కొన్నారు. దేశంలోని మరో 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ 10+2 విధానం విజయవంతంగా అమలవుతోందని గుర్తు చేశారు.
విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించి, పోటీ పరీక్షలకు (JEE, NEET వంటివి) సిద్ధమయ్యేందుకు వీలుగా 10, 12 తరగతులకు మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించి, 11వ తరగతి(ఇంటర్ ఫస్టియర్) పరీక్షలను కాలేజీ/స్కూల్ స్థాయిలోనే అంతర్గతంగా(Internal Assessment) నిర్వహించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
కొత్త విధానం అమల్లోకి వస్తే కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే నడుపుతున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తమ విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇంటర్ కాలేజీలు మాత్రమే నడుపుతున్న యాజమాన్యాలు, కొత్త నిబంధనల ప్రకారం 9, 10 తరగతులు కూడా నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇప్పటికే స్కూళ్లు, జూనియర్ కాలేజీలు రెండూ నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలకు ఇబ్బంది లేకపోయినా.. కేవలం జూనియర్ కాలేజీలు మాత్రమే ఉన్నవారు అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను పెంచుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం 10వ తరగతి పూర్తయ్యాక విద్యార్థులు స్కూల్ నుండి జూనియర్ కాలేజీకి మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక కారణాలు, దూరభారం వల్ల ముఖ్యంగా బాలికలు మధ్యలోనే చదువు మానేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. 10+2 విధానం ద్వారా విద్యార్థులు 10వ తరగతి తర్వాత వేరే కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, తాము చదువుతున్న స్కూల్ ఆవరణలోనే 11, 12 తరగతులు పూర్తి చేసే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
స్కూల్, ఇంటర్ విద్యావిధానాల విలీనంతో తమ ఉద్యోగాలు, ప్రమోషన్లు, సర్వీస్ నిబంధనలపై ప్రభావం పడుతుందని ఇంటర్ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న లెక్చరర్లు, ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్ అవకాశాలకు ఎలాంటి ఆటంకం కలగదని అధికారులు భరోసా ఇచ్చారు.
పరీక్షలు నిర్వహించే ఇంటర్ బోర్డు, పరిపాలన చూసే ఇంటర్మీడియట్ కమిషనరేట్ వేర్వేరు విభాగాలని అధికారులు వివరించారు. కొత్త విధానంలో కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం కమిషనరేట్‌ను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం మాత్రమే ఉంది.
ఈ కొత్త 10+2 విధానానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రజల ముందుకు తీసుకురానుంది. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు, యాజమాన్యాల సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


