హైదరాబాద్ CURE పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు.. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన గడువు నేటితో (అక్టోబరు 21) ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) ఖాళీలను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బి.ఈ (B.E) లేదా బి.టెక్ (B.Tech) పూర్తయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- అభ్యర్థులకు మల్టీస్టోర్డ్ రెసిడెన్షియల్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
- హైరైజ్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లు, ఈపీసీ పనులు, క్వాలిటీ కంట్రోల్, క్వాంటిటీ సర్వేయింగ్, ఆటోక్యాడ్, అంచనాల రూపకల్పన లో అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.
- 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 44 ఏళ్లు మించకూడదు.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33,800 చొప్పున వేతనం చెల్లిస్తారు. టీజీహెచ్‌బీ చీఫ్ ఇంజినీర్ లేదా డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ కేటాయించిన విధంగా హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ - దరఖాస్తు విధానం

ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో సాగుతుంది. మొదటగా క్వాలిఫైయింగ్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రతిభ (మెరిట్) ఆధారంగా ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. అనంతరం టీజీహెచ్‌బీ (TGHB) చీఫ్ ఇంజినీర్ కార్యాలయం మరియు సంబంధిత ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించే ముఖాముఖి (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం గూగుల్ ఫారమ్ (Google Form) ఆన్‌లైన్ లింక్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి 2026 అక్టోబరు 21 సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tghb.telangana.gov.in ను సందర్శించి ఆన్‌లైన్ లింక్ ద్వారా దరఖాస్తును పూర్తి చేయవచ్చు.
ఈ నియామకం పూర్తిగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందని, ఇది హౌసింగ్ బోర్డులో ఎలాంటి శాశ్వత ఉద్యోగానికి హక్కును కల్పించదని నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.