తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 24న నిర్వహించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల ప్రాథమిక 'కీ' (Preliminary Key)ని టీజీపీఎస్సీ విడుదల చేసింది.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాస్టర్ ప్రశ్నాపత్రాలను, ప్రాథమిక కీని టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ఆధారంగా…. ఈ నెల 30వ తేదీ వరకు వెబ్సైట్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పొందే సౌకర్యాన్ని కల్పించారు.
అభ్యంతరాల నమోదుకు గడువు.. రుసుము వివరాలు
ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కమిషన్కు తెలియజేయవచ్చు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అభ్యంతరాలను సమర్పించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన విజ్ఞప్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని పేర్కొంది.
అభ్యంతరాలు వ్యక్తం చేసే ప్రతి ప్రశ్నకు రూ.500 చొప్పున అభ్యంతర రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారానే చెల్లించాలని అధికారులు తెలిపారు. అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదేనని నిపుణుల కమిటీ నిర్ధారిస్తే.. వారు చెల్లించిన రూ.500 రుసుమును తిరిగి వారి ఖాతాలో జమ చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. సరైన ఆధారాధారాలతో ఆన్లైన్ విధానంలోనే అభ్యంతరాలను అప్లోడ్ చేయాలని సూచించింది.
ప్రాథమిక కీ డౌన్లోడ్ ఇలా…
- ముందుగా https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Assistant Scientist Key లింక్ పై క్లిక్ చేయాలి.
- టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే ప్రాథమిక కీలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కీ కాపీలను పొందొచ్చు.