TGSRTC : బస్ స్టాండ్‌ల వద్ద 694 దుకాణాల లీజు.. టీజీఎస్ఆర్టీసీ టెండర్లు!

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) బస్ స్టాండ్‌ల వద్ద ఖాళీగా ఉన్న దుకాణాలను లీజుకు ఇవ్వనుంది. 694 ఖాళీ వాణిజ్య దుకాణాలు, స్థలాల కోసం త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది.

Published on: Jun 24, 2026, 18:50:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీజీఎస్ఆర్టీసీ తన ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు, స్థానిక వ్యాపారవేత్తలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ బస్టాండ్లు, డిపోల పరిధిలోని 694 ఖాళీ వాణిజ్య దుకాణాలు, స్థలాలను లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

టీజీఎస్ఆర్టీసీ కమర్షియల్ స్థలాలు లీజుకు
టీజీఎస్ఆర్టీసీ కమర్షియల్ స్థలాలు లీజుకు

తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, డిపోల ప్రాంగణాల్లో అందుబాటులో ఉన్న అన్ని వాణజ్య స్థలాల పూర్తి వివరాలను సంస్థ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్ అయిన tgsrtc.telangana.gov.inలో అందుబాటులో ఉంచింది.

గతంలో బస్టాండ్లలోని దుకాణాల కేటాయింపుల్లో దళారీల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చేవి. వీటికి అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకతను పెంచేందుకు టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం సరికొత్త ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఏయే దుకాణాలు ఖాళీగా ఉన్నాయి? ప్రస్తుతం ఏ దుకాణంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారు? వారి లీజు కాలపరిమితి ఎంత? వారు చెల్లిస్తున్న నెలవారీ అద్దె ఎంత? అనే పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో బహిరంగపరిచింది.

ఈ సందర్భంగా టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. దుకాణాల లీజు ప్రక్రియను మరింత సరళతరం చేశామని తెలిపారు. వ్యాపారస్తులు, స్థానిక యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 'టీజీఎస్‌ఆర్‌టీసీతో భాగస్వాములు కండి.. మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి.' అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ సరికొత్త చొరవ అటు సంస్థకు, ఇటు వ్యాపార వర్గాలకు పరస్పర ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్లు, రవాణా కేంద్రాల గుండా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించే వారికి కస్టమర్లను ఆకర్షించడానికి ప్రత్యేకంగా అదనపు ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎప్పుడూ వ్యాపారానికి సిద్ధంగా ఉండే భారీ కస్టమర్ బేస్ అందుబాటులో ఉంటుంది.

ఈ ఖాళీ స్థలాలు వివిధ రకాల వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. భారీ హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌లు, చిన్న తరహా రిటైల్ ఔట్‌లెట్లు, ఫ్యాన్సీ స్టోర్లు, బుక్ స్టాళ్లు మొదలైనవటిగా బాగుంటాయి.

ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా టీజీఎస్‌ఆర్‌టీసీకి అదనపు అద్దె ఆదాయం సమకూరడమే కాకుండా.. స్థానిక నిరుద్యోగ యువతకు, చిన్న తరహా వ్యాపారులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించి ఖాళీ స్థలాల వివరాలను పరిశీలించవచ్చని, దుకాణాల కేటాయింపులు పూర్తిగా పారదర్శకమైన టెండర్ విధానం ద్వారానే జరుగుతాయని సంస్థ స్పష్టం చేసింది.

టెండర్ల షెడ్యూల్, దరఖాస్తు విధానం, నిబంధనల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నిరంతరం tgsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More