టీజీఎస్ఆర్టీసీ భరోసా.. రోడ్డు ప్రమాదంలో మరణించినవారికి రూ.కోటి ఆర్థిక సాయం

తెలంగాణ ఆర్టీసీ.. ఉద్యోగులకు అండగా నిలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ భరోసా అందిస్తుంది.

Updated on: May 26, 2026, 19:46:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. పికెట్, పరిగి డిపోలకు చెందిన డ్రైవర్లు సుధాకర్, శ్రీనివాసరెడ్డిలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత డ్రైవర్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

ఈ ఆపద సమయంలో యూనియన్ బ్యాంక్ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు ఉపయోగపడింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద యూబీఐ రూ. కోటి అందజేస్తోంది.

ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. కోటి విలువైన చెక్కులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఏం.రవీంద్రబాబు, రీజనల్ హెడ్‌డీ.వెంకటేశ్వర్లలతో కలిసి టీజీఎస్ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వేరు వేరు సమయాలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనలో పికెట్, పరిగి డిపోలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు మరణించడం విచారకరమన్నారు. తమ తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో డ్రైవర్స్ అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోషణలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు.

కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ సీహెచ్.వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, సీపీఎం ఉషాదేవి, యూబీఐ అధికారులు పాల్గొన్నారు.

బాధితుల వివరాలు

డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తన ఇంటి నుండి విధుల కోసం పికెట్ డిపోకు ఉదయం ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న పాల లారీ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన మరణించారు. పరిగి డిపోకు చెందిన మరో డ్రైవర్ సుధాకర్ విధులకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన బైక్ వేగంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More