మేడారం జాతరకు 3,495 ప్రత్యేక బస్సులు - ఛార్జీలు అదనమే..!
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. భక్తుల కోసం ఈసారి 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్నివైపుల నుంచి ఈ ప్రత్యేక బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేయనుంది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలుంటాయి.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖలు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రతలు తీసుకునే పనిలో పడ్డాయి. అయితే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా ఈసారి కూడా భారీగానే తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ మేడారం జాతర జరగనుంది. అయితే ఇప్పటికే చాలా మంది మేడారానికి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో భక్తుల మరింత పెరగనుంది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని….. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భక్తుల రద్దీ అంచనాలకు మించి మరీ ఎక్కువగా ఉంటే… మరిన్ని బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.
ఇక ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేస్తారు. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. ఇదే నిర్ణయం మేడారం ప్రత్యేక బస్సులకు వర్తించనుంది.
ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో…. ఆయా జిల్లాల నుంచి ఎక్కువగా బస్సులు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.
మరోవైపు మేడారంలో కూడా తాత్కాలిక బస్ స్టాండులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. క్యూలైన్లు, టిక్కెట్ల కౌంటర్, పార్కింగ్ స్థలాలు, క్యాంటీన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకవస్తోంది. కమాండ్ కంట్రోల్ రూం, తాత్కాలిక మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా…. ఈనెల 23న ప్రారంభించనున్నారు.
మేడారం మహాజాతర - ముఖ్యమైన తేదీలు
- జనవరి 14 - గుడిమేలిగే పండుగ
- జనవరి 21 - మండమెలిగే పండుగ
- జనవరి 27 - మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం. ఇదే రోజు తాడ్వాయి మండలంలో కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరి మేడారం గద్దెకు చేరుకుంటారు
- జనవరి 28 - కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరునాగారం మండలంలో గల కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు
- జనవరి 29 - వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి చేరుకుంటారు
- జనవరి 30 - భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తారు
- జనవరి 31 - దేవతల వన ప్రవేశం
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

